Huge income for Sabarimala Ayyappa temple in last 39 days
mictv telugu

శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం

December 27, 2022

కేరళలోని ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత 39 రోజుల వ్యవధిలో ఆలయానికి రూ.222 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. ఈసారి స్వామి దర్శనానికి చిన్నారులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపింది. నవంబర్ 17న మండల పూజలు ప్రారంభం కాగా.. అప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు శబరిమల దర్శనానికి పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన నేపథ్యంలో హుండీ ఆదాయం సైతం గణనీయంగా నమోదైంది.

మొత్తంగా రూ.222.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ తెలిపారు. ఇందులో భక్తులు కానుకల రూపంలో నేరుగా సమర్పించిన మొత్తం రూ.70.15 కోట్లు అని చెప్పారు. సుమారు 30 లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని… అందులో ఐదో వంతు చిన్నారులే ఉన్నారని తెలిపారు. గడిచిన రెండేళ్లలో రాలేకపోయిన నేపథ్యంలో ఈసారి చిన్నారులు భారీ సంఖ్యలో దర్శనానికి వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు.