తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నేటివరకు జేఎల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడలేదు. దీంతో టీచింగ్ వైపు వెళ్లాలని కలలుకంటున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను చిగురింపజేస్తూ ఇంటర్ బోర్డు శుభవార్త తెలిపింది. బోర్డు పరిధిలోని కాలేజీల్లో భారీస్థాయిలో జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది పనిచేస్తున్నారని, కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలో భాగంగా వీరందరినీ రెగ్యులరైజ్ చేయాల్సి ఉందని పేర్కొంది.
అయితే, ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలను పంపించినట్టు సమాచారం. అంతేకాకుండా తెలంగాణలో మరో 1,393 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు ఇంటర్ బోర్డులో ఖాళీగా ఉన్న 91 ఫిజికల్ డైరెక్టర్లు, 343 జూనియర్ అసిస్టెంట్లు, 40 లైబ్రేరియన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం… మల్టీ జోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668 జేఎల్ పోస్టులు ఉన్నాయి.వీటిలో తెలుగు, ఇంగ్లీషు మీడియంతోపాటు ఉర్దూ, మరాఠీ మీడియం పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే ప్రధాన సబ్జెక్టులతోపాటు ఫ్రెంచ్, సంస్కృతం, అరబిక్, మరాఠీ వంటి లాంగ్వేజ్ పోస్టులు కూడా ఉన్నాయి. అధికారుల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే.. త్వరలోనే జేఎల్ పోస్టుల భర్తీకి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది. అనంతరం భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది.