Huge Loss To Producer Dil Raju
mictv telugu

పంతంతో పతనం.. భారీ నష్టాల్లో దిల్ రాజు..!

January 15, 2023

Huge Loss To Producer Dil Raju

ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన వారసుడు చిత్రం కంటెంట్ పరంగా పర్వాలేకున్నా.. ఈ జెనరేషన్ లో చెప్పాల్సిన కథ కాదనే మాట సర్వత్రా వినిపిస్తుంది. ప్రస్తుతం పబ్లిక్ అంతా మాస్ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ క్రైమ్ ఎలిమెంట్స్ ని ఇష్టపడుతుంటే.. మూస కుటుంబ కథ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేవని అంటున్నారు. ఈ కారణంగా తమిళంలో వారిసు సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా.. అరవ ప్రేక్షకులు ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువగా కనెక్ట్ కాలేకపోయారు. ఇక తెలుగులో వారసుడు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పంతం పట్టి మరి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల థియేటర్స్ కి సమానంగా డబ్బుంగ్ మూవీ వారసుడుని రిలీజ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. కానీ వారసుడు రిజల్ట్ తెలుగులో తేడా కొట్టేలానే కనిపిస్తుంది. నాలుగు రోజుల ముందే తమిళంలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న వారసుడుకి తెలుగులో కనీసం పర్లేదు అన్న టాక్ కూడా రాలేదని అంటున్నారు.

పదుల సంఖ్యలో హిట్ అయిన తెలుగు సినిమాలని కలిపి తీసిన కలబోతగా వారసుడు ఉందని ఇప్పటికే తెలుగు ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. మాస్ మూవీ కాకపోవడం వారసుడికి మరో ప్రధాన మైనస్. తమిళంలోనే అండర్ పెర్ఫామ్ చేస్తున్న సినిమా.. తెలుగులో చిరు, బాలయ్యల సినిమాలను ఢీకొట్టి నిలవడం కష్టమే అనిపిస్తోంది. ఇక తమిళంలో మొదటి రోజు ఏకంగా 19.43 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజుకి కేవలం 8.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు మరింత డ్రాప్ అయ్యి 7.11 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా మూడు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్స్ 35.29 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ దిశగా వెళ్తుంది. అయితే తెలుగు హీరోలు, డిస్ట్రిబ్యూటర్స్ తో సఖ్యతగా ఉంటూ.. కాస్త పంతం వీడి రిక్వెస్ట్ మోడ్ లో వెళ్లుంటే.. దిల్ రాజుకి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి జనవరి 12వ తేదీ దొరికేదని.. అప్పుడు రెండు భాషల్లో ఒకే రోజు రిలీజ్ కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్స్ భారీగా వచ్చి వారసుడు సేఫ్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.