ఆదాయం పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రవేశపెట్టిన మరో వినూత్న పథకాలకి కూడా అపూర్వ స్పందన లభిస్తోంది. రూ.300 చెల్లిస్తే రోజంతా నలుగురు ప్రయాణించేలా ఎఫ్-24 టికెట్లను,.. అదేవిధంగా మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి6 టికెట్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ టికెట్లను మొన్న శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టికెట్లను ప్రయాణికులు కొంటున్నారని, ఏయే టికెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందో తెలియచెప్పడం వల్ల వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని కండక్టర్లు అంటున్నారు. శని, ఆదివారాల్లో ఎలాగూ ఫంక్షన్లకు, పార్టీలకు, షాపింగ్‌లకు వెళ్లే జనాలకు ఈ టికెట్లు బాగా ఉపయోగపడుతున్నాయని.. ప్రయాణికులు కూడా డబ్బులు ఆదా అవుతాయనే ఉద్దేశంతో వీటిని కొంటున్నారని చెప్పారు.
అంతకుముందు ప్రయాణికుల కోసం టీ-24 టిక్కెట్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. రూ.100 టిక్కెట్ కొనుగోలు చేసి రోజంతా సిటీ(మెట్రో, ఆర్డినరీ) బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించారు. దీనికి మంచి ఫలితాలు రావడంతో.. ఈ పథకంలో కొనసాగింపుగా ఫ్యామిలీ కోసం కొత్తగా ఎఫ్- 24 టిక్కెట్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. నలుగురు కలిసి ప్రయాణించడానికి రూ.400 బదులుగా రూ.300 నిర్ణయించారు. ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ప్రయాణించే విధంగా ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టిక్కెట్లు హైదరాబాద్ సబర్బన్ పరిధిలోనే చెల్లుతాయి.
ఇక మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన టి-6 టికెట్(రూ.50)ను కొనుగోలు చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 6 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వీలుంది. ఈ టిక్కెట్లు కొనుగోలు చేసే క్రమంలో సీనియర్ సిటిజన్లు ఆధార్ కార్డు చూపించి కండక్టర్‌కు సహకరించాలని ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి కోరారు. భవిష్యత్తులో సిటీ బస్సుల ఆదాయం పెంచుకునేందుకు మరికొన్ని రాయితీలు ప్రకటించే అంశాలు యాజమాన్యం పరిశీలనలో ఉన్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు పేర్కొన్నారు.