Huge robbery in Manappuram Finance in rajasthan
mictv telugu

మణప్పురం ఫైనాన్స్‌లో భారీ దోపిడీ.. 12 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు

August 29, 2022

Huge robbery in Manappuram Finance in rajasthan

బంగారు నగలను తాకట్టు పెట్టుకొని అప్పులిచ్చే మణప్పురం ఫైనాన్స్ సంస్థలో సోమవారం భారీ దోపిడీ జరిగింది. సిబ్బందికి తుపాకీ గురిపెట్టిన ఐదుగురు ముసుగు దొంగలు.. రూ. 12 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన రాజస్థాన్ ఉదయ్ పూర్‌లోని ప్రతాప్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం తొమ్మిదిన్నర సమయంలో ఆఫీసు తెరచి ఉంచగా, తుపాకీ కలిగిన ఐదుగురు వ్యక్తులు ఆపీసులోకి చొరబడ్డారు. ముఖానికి ముసుగులు వేసి, హెల్మెట్ కూడా ధరించారు.

ఆఫీసులోకి చొరబడ్డ వెంటనే సిబ్బందిని బెదిరించి వారి చేతులను తాళ్లతో కట్టిపడేశారు. తర్వాత కీ ఉన్న ఇద్దరు ఉద్యోగుల తలపై తుపాకీ గురిపెట్టి లాకర్స్ తెరిపించారు. తర్వాత వారి చేతులు కూడా కట్టేసి, లాకర్లలో ఉన్న నగదు, బంగారు నగలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. అనంతరం బయటకి వచ్చి బైకులపై పారిపోయారు. అప్పటివరకు ఉద్యోగుల చేతులు కట్టేసి ఉండగా, ఒకరి చేతులు గట్టిగా కట్టకపోవడంతో అతడు తాడు విప్పదీసి, మిగతావారి కట్లను విప్పేశాడు. తర్వాత అందరూ కలిసి పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. దుండగులు 20 కేజీలకు పైగా నగలు, పది లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అటు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా, ఆఫీసు వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేదని తేలింంది. దాంతో అన్ని కోణాల్లో విచారణ జరిపి, నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.