human body compost for plants-new trend in USA
mictv telugu

మానవ మృతదేహమే ఎరువు…అమెరికాలో నూతన ప్రయోగం

January 6, 2023

మొక్కలకు ఎరువులను రకరకాల పదార్ధాల నుంచి తయారు చేస్తారు. పళ్ళు, కూరలు, ఆకులు, పువ్వులు ఇలా అన్ని రకాలతో కంపోస్ట్ ను తయారు చేస్తారు. కొంతమంది జంతువుల వ్యర్ధాలతో కూడా చేస్తామని చెబుతుంటారు. కానీ మనిషి శరీరాలను మొక్కల కంపోస్ట్ గా వాడడం గురించి ఎప్పుడైనా విన్నారా. వామ్మో ఇదెక్కడి చిత్రం….అసలు మనుషుల బాడీలను ఎలా వాడతారు అని అనుకుంటున్నారా. ననిజంగానే మనుషుల చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీల నుంచి కంపోస్ట్ చేస్తున్నారు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల వాళ్ళు. ఆ కతేమిటో చూద్దాం రండి.

వాషింగ్టన్, న్యూయార్క్ సహా అమెరికాలోని ఆరు రాష్ట్రాలు ఈ హ్యూమన్ కంపోస్ట్ ను వాడుతున్నాయి. అక్కడ ఇది వాడడానికి అధికారిక అనుమతులు కూడా ఉన్నాయి. అమెరికాలోని ఓ సంస్థ మృతదేహాల నుంచి కంపోస్ట్ ను తమారు చేసి విక్రయిస్తోంది. దీనికి నెమ్మదిగా ఆదరణ కూడా పెరుగుతోందట. ఆ ప్రాసెస్ లో ఎలా జరుగుతుందో తెలుసా.

ముందు మృతదేహాన్ని మట్టిలో కలిసేలా ఏర్పాటు చేస్తారు. దీని కోసం కొన్ని ప్రత్యేక విధానాలు కూడా పాటిస్తారు. అవి పూర్తిగా పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఉంటాయిట.అంటే పూర్తిగా నేచరల్ ఆర్గానిక్ రిడక్షన్ తరహాలో శవాలను కంపోస్ట్ గా మారుస్తారన్నమాట. మొదటగా మట్టి, కర్ర ముక్కలు, పచ్చి గడ్డి, ఎండు గడ్డితో నింపిన డబ్బాలో మృతదేహాన్ని 30 రోజులపాటు ఉంచుతారు. దీని ద్వారా సూక్ష్మజీవుల సాయంతో శరీరం విచ్ఛిన్నం అయ్యేలా జాగ్రత్తలు వహిస్తారు.నెల రోజుల తర్వాత, ఈ మిశ్రమాన్ని అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేస్తారు. ఫలితంగా దీని నుంచి ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలా మొత్తం ప్రాసెస్ పూర్తయ్యాక కంపోస్ట్ తయారవుతుంది. అప్పడు దాన్ని అమ్మకానికి తయారు చేస్తారు. ఈ మానవ కంపోస్ట్ వల్ల మొక్కలు మరింత బాగా పెరుగుతాయని చెబుతోంది అమెరికన్ కంపెనీ.

ఎంత వరకూ మంచిది:

సంప్రదాయ విధానాల్లో అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు విడుదలయ్యే కార్బన్‌ను హ్యామన్ కాంపోస్టింగ్‌తో చాలావరకు తగ్గించవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భూమి వేడెక్కడానికి కార్బన్ ఉద్గారాలే ప్రధాన కారణం అని అంటున్నారు.వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, అందుకే హ్యూమన్ కాంపోస్టింగ్‌పై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని రీకంపోస్ ఫౌండర్ చెప్పారు. దీనికి అమెరికా ప్రభుత్వం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తోంది.

సంప్రదాయ విధానాల్లో అంత్యక్రియల కోసం కర్రలు, మట్టి భారీగా అవసరం అవుతాయి. అదే హ్యూమన్ కాంపోస్టింగ్‌లో వీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది.ఈ ప్రాసెస్ పూర్తిగా పర్యావరణహిత విధానమని నిపుణులు కూడా చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో భూమి దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఇది మంచి పరిష్కారమని మరికొందరు అంటున్నారు.

అయితే జనాలు దీన్ని పూర్తిగా స్వీకరించడం లేదు. కొంతమంది మృతదేహాలను అలా ఎలా చేస్తామని ప్రశ్నిస్తుంటే…మరికొంత మామూలుగా మృతదేహాలను, కాల్చి, పూడ్చి పెట్టే విధానం కన్నా ఇలా చేయడం వలన ఎక్కువ ఖర్చు అవుతుందని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పద్ధతి జనాల్లోకి వెళ్ళడానికి టైమ్ పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరో వైపు స్వీడన్‌లోనూ ఈ విధానాన్ని అనుమతిస్తున్నారు. బ్రిటన్‌లో అయితే, శవపేటిక లేకుండా పూడ్చిపెట్టడం లేదా బయోడిగ్రేడబుల్ శవపేటికలతో పూడ్చిపెడ్డటానికి మాత్రమే అనుమతిస్తున్నారు.