ఢిల్లీలో మత సామరస్యం..మానవహారంలా హిందూ, ముస్లింలు - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో మత సామరస్యం..మానవహారంలా హిందూ, ముస్లింలు

February 27, 2020

bjkxfg

దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు చేపట్టడంతో హింస చెలరేగింది. ఇటువంటి పరిస్థితుల్లో జనం ఇల్లుదాటి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇలాంటి సమయంలో  తూర్పు ఢిల్లీలోని యమునా విహార్‌లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. స్కూలు నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల రక్షణ కోసం హిందూ, ముస్లిం యువకులు అంతా కలిసి కట్టుగా మానవ హారంలా నిలబడ్డారు. అల్లర్లు చేయడానికి వస్తున్న ఆకతాయి గుంపును వారే స్వయంగా తరిమికొడుతూ స్థానిక ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇక్కడ మతపరమైన విధ్వేషాలు లేకుండా తాము సామరస్యంగా జీవిస్తున్నామని వారు చెబుతున్నారు. 

హింసాత్మక ఘటనల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకు రక్షణగా స్థానికులు మానవ హారంగా నిలబడ్డారు. చాలా ఏళ్ల నుంచి హిందూ, ముస్లింలు శాంతియుతంగా జీవిస్తున్నామని చెబుతున్నారు. ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని, అందుకే, తామంతా కలిసే ఈ మతఘర్షణలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని అంటున్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వారిని సైతం తమ ప్రాంతం నుంచి బయటకు పంపించి వేస్తున్నారు. పథకం ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే ఈ సమస్య వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇకనైనా ప్రజలు శాంతియుతంగా సామరస్య వాతావరణంలో ఉండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.