అమ్మ ప్రేమ.. వరదల్లో బిడ్డను కాపాడుకున్న శునకం(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మ ప్రేమ.. వరదల్లో బిడ్డను కాపాడుకున్న శునకం(వీడియో)

October 18, 2020

Human or animal, the mother is the mother the dog rescued her child from the flood, see VIDEO.jp

వాన భీభత్సం జనజీవితాన్నే కాదు మూగ జీవాలను కూడా అతలాకుతలం చేస్తోంది. మనుషులు తమనుతాము రక్షించుకోవడానికే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక మూగజీవాలను ఎవరు రక్షిస్తారు. అవి ఎప్పుడూ ఒంటరి జీవులే. ప్రతిరోజూ వాటికి జీవన పోరాటమే. ఈ భారీ వర్షాలతో ఆ పోరాటం మరింత ఎక్కువైంది. కడుపుకు తిండి లభించక కొన్ని మూగజీవాలు వరదలకు కొట్టుకుపోయి మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని ఈ కుక్కమ్మలా తమ బతుకు పోరాటాన్ని మరింత ఉదృతం చేశాయి. వరద నీటిలో చిక్కుకున్న తన కూనను నోట కరుచుకున్న కుక్కమ్మ దానిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని తారాపూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. భారీ వర్షాలు కురియడంతో ఆ ప్రాంతమంతా వరద నీటితో నిండిపోయింది. తన పిల్లలను దాచుకున్న తల్లి శునకం అక్కడ తన పిల్లలకు ప్రమాదం అని గ్రహించింది. వెంటనే తన బిడ్డను నోట కరుచుకుని సురక్షిత ప్రాంతానికి తరలించింది. దీనినంతటినీ ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌‌గా మారింది. తన పిల్లను వరద ముంపు నుంచి కాపాడుకునేందుకు ఆ శునకం చేసిన ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తల్లి ప్రేమకు వెల కట్టడం ఈ ప్రపంచంలో ఏ కుబేరుని తరం కూడా కాదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి వీడియోలు మాత్రమే తీయకుండా నోరులేని ఆ జీవాలకు ఏదైనా సాయం కూడా చేయండి అని సలహాలు ఇస్తున్నారు. కాగా, గతంలో కూడా ఓ ఎలుక తన పిల్లలు వరదల్లో చిక్కుకోగా ప్రాణాలకు తెగించి నీళ్లలోకి వెళ్లి ఒక్కొక్కదాన్ని బయటకు తెచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే.