కొడుకు పుట్టాలని.. పొరిగింటి పిల్లను బలి ఇచ్చారు.. - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు పుట్టాలని.. పొరిగింటి పిల్లను బలి ఇచ్చారు..

October 20, 2017

మన సమాజం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత ముందుకుపోతోందో, మూఢనమ్మకాలు, కులమత వివక్ష తదితరాల్లో అంత వెనక్కి పోతోంది. నలుగురు కూతుళ్లున్న ఓ తండ్రి.. కొడుకు పుట్టాలనే ఆశతో పొరుగింటి చిన్నారిని గొంతుకోసి బలి ఇచ్చాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని సహరణ్ పూర్‌లో జరిగింది. సతీశ్ సింగ్, నమితలకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఒక కొడుకు కూడా పుట్టాడు గాని 18 నెలల వయసులో చనిపోయాడు. పున్నామ నరకం నుంచి కొడుకే కాపాడతాడని సతీశ్ నమ్మకం. పైగా నలుగురు ఆడపిల్లల పోషణ అతనికి భారంగా మారింది. కొడుకే తనను ఉద్ధరిస్తాడని అనుకున్నాడు.

కొడుకు పుట్టే మార్గం చెప్పాలని మంత్రగాడైన వృక్ష పాల్‌ను అడిగాడు. ఒక బాలికను దేవుడికి బలి ఇస్తే కొడుకు పుడతాడని చెప్పాడు పాల్. దీంతో సతీశ్, నమితలు పొరుగింటికి చెందిన.. అక్షిత అనే నాలుగేళ్ల పిల్లను అ నెల 1న కిడ్నాప్ చేశారు. ఆమె చేయి, కాలు, చెవి కోసేసి, తర్వాత గొంతు కోసి దారుణంగా చంపారు. ఇందుకు నమిత తండ్రి కూడా సాయం చేశాడు. తన కూతురు కనిపించలేదని అక్షిత తండ్రి మహావీర్ సింగ్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల తర్వాత అతని ఇంటికి దగ్గర్లోని పొలంలో అక్షిత మృతదేహం కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేయగా సతీశ్, నమితలు చేసిన ఘోరం బయటపడింది. పోలీసులు సతీశ్‌ను, మంత్రగాడిని ఆరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నమిత, అతని తండ్రికోసం గాలిస్తున్నారు. నరబలి ఇచ్చాక ఆ పాప మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి దగ్గర్లో ఉంచాలని మంత్రగాడు చెప్పాడని, దీంతో సతీశ్ అలాగే చేశాడని పోలీసులు తెలిపారు.