ఈసారి ఇద్దరు పిల్లల ఖాతాల్లో రూ. 906 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి ఇద్దరు పిల్లల ఖాతాల్లో రూ. 906 కోట్లు

September 16, 2021

బిహార్‌లోని ఖగరియాలో తన బ్యాంకు ఖాతాలోకి పొరపాటున జమ అయిన రూ. 5.5 లక్షలను మోదీనే వేశారని పొరపడి ఖర్చు చేసి జైలు పాలైన రంజిత్ దాస్ సంఘటన ఇంకా మరువక ముందే అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. అది కూడా బిహార్‌లోనే. ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో వందల కోట్లలో నగదు డిపాజిట్ కావటంపై వారి కుటుంబ సభ్యులే కాదు, మొత్తం గ్రామస్థులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపైనే ఆ ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

కతిహార్ జిల్లా బగౌరా పంచాయతీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన విద్యార్థులు.. గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్లకు ఉత్తర్ బిహార్ గ్రామిణ్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. పాఠశాల యూనిఫామ్స్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత నగదును సహాయంగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తోంది. ఆ నగదు సహాయం తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకోవడానికి సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సెంట్రలైస్డ్ ప్రాసెసింగ్ సెంటర్కు వెళ్లి ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేయించారు. అయితే.. తమ ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. విశ్వాస్ ఖాతాలో రూ.6 కోట్లు, కుమార్ ఖాతాలో రూ.900 కోట్లు జమయ్యాయి.

ఈ సంఘటనపై బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తాను సంప్రదించగా ఆయన కూడా ఓకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. బ్యాంకు స్టేట్ మెంట్లలో వందల కోట్లు కనిపిస్తున్నా, నిజానికి వారి ఖాతాల్లో అంత డబ్బులేదన్నారు. వారి ఖాతాలను స్తంభించేశారు. దీనిపై పైఅధికారులకు సమాచారం అందించారు గుప్తా. ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం పరిపాటిగా మారిందిని, అయిన కూడా అధికారులు అలసత్వాన్ని వీడటం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.