పది రోజులుగా గుండ్రంగా తిరుగుతున్న గొర్రెలు.. వీడియో చూసి విస్తుపోతున్న సైంటిస్టులు - MicTv.in - Telugu News
mictv telugu

పది రోజులుగా గుండ్రంగా తిరుగుతున్న గొర్రెలు.. వీడియో చూసి విస్తుపోతున్న సైంటిస్టులు

November 18, 2022

చైనాలో వింత సంఘటన చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో ఉన్న గొర్రెలు విచిత్రంగా గుండ్రంగా తిరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదిరోజులకు పైగా గొర్రెలు ఇలా తిరగడంతో మిస్టరీగా మారింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో ఇది జరిగింది. ఏమాత్రం గాడి తప్పకుండా కచ్చితమైన సర్కిల్ లో ఇవి తిరుగుతూనే ఉన్నాయి. దీంతో స్థానికులు ఆశ్చర్యపోతుండగా, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయో తెలియక సైంటిస్టులు తలలు పట్టుకుంటున్నారు.

 

దీనిపై ఎవ్వరి వద్దా సమాధానం లేకుండా పోయింది. దీంతో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. కుక్కలు, ఆవులు వంటివి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాయని, గొర్రెల ప్రవర్తన ఇలా ఉందంటే కచ్చితంగా ఏదో ప్రమాదం పొంచి ఉందనే సంకేతమని కొందరు చెప్తున్నారు. సునామీలు వంటివి వచ్చినప్పుడు తాబేళ్ల వంటి జలచరాలు కూడా ఒడ్డుకు వచ్చేస్తాయని ఉదహరిస్తున్నారు. ఇదిలా ఉంటే లిస్టెరియోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి ఇలా తిరగడానికి కారణమవుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. దీన్ని సర్ల్కింగ్ డిసీజ్ అంటారని కొత్త భాష్యం చెప్తున్నారు. అయితే ఇంతలా తిరుగుతున్నా అన్ని గొర్రెలు ఆరోగ్యంగానే ఉండడం మరో విశేషంగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీపుల్స్ డైలీ అనే సంస్థ బుధవారం ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా గొర్రెల ప్రవర్తన మాత్రం ఇప్పటివరకు మిస్టరీగానే మిగిలిపోయింది.