మందు కొనకముందే మైండ్ బ్లాకై పడిపోయిన మగువ
మందుబాబులు అంటే కేవలం మగవాళ్లనే బదనామ్ చేస్తూ వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా మద్యం లభించక మగాళ్లే తాయిమాయి అవుతున్నారనుకుంటే పొరపాటే. మందు కొనడానికి మగాళ్లకు ధీటుగా మగువలు కూడా క్యూ లైన్‌లో నిలబడ్డారు. కొన్ని చోట్ల పోటాపోటీగా ఎగబడ్డారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో అలాంటిదే ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ రోడ్డు విలాసమైన పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ ఏరియాను కాస్ట్లీ ఏరియా అంటారు. ఆ ప్రాంతంలో స్థానిక టానిక్ వైన్ షాప్ కూడా ఉంది. లాక్‌డౌన్ పొడిగించి మద్యం షాపులు తెరవడానికి అనుమతులు లభించడంతో టానిక్ వైన్స్ కూడా తెరుచుకుంది. ఇంకే పోమవారం ఉదయం షాపు ముందు చాంతాడంతా లైన్ ఉంది.
మద్యం కొనుగోలు చేయడానికి వందలాది మంది క్యూలో నిలబడి ఉన్నారు. అయితే ఈ వరుసలో పురుషులతో పాటు కొందరు యువతులు కూడా నిలబడి ఉన్నారు. క్యూలైన్ ముందుకు సాగుతున్న సమయంలో లైన్‌లో నిలబడ్డ యువతి హఠాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న కొందరు కంగారుపడ్డారు. పోలీసులు కూడా వచ్చి సదరు అమ్మాయిని లేపి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. మంచినీళ్ళ బాటిల్ తీసుకువచ్చి ఆ యువతికి తాగించారు. కొద్ది సేపటికి తేరుకున్నాక ఆ యువతిని ఎందుకిలా పడిపోయావని ప్రశ్నించారు. ‘గత 45 రోజులుగా లాక్‌డౌన్ కారణంగా బార్లు బంద్ అవడంతో మందు దొరక్క ఇబ్బంది పడుతున్నాను. మందు అమ్ముతున్నారని తెలిసి ఉదయం టిఫిన్ చేయకుండా క్యూలో నేను, నా స్నేహితులు కూడా టిఫిన్ చేయకుండా నిలబడ్డాం’ అని చెప్పింది. ఆమె చెప్పింది విని పోలీసులకు ఏం మాట్లాడాలో తెలియక తెల్లమొహాలు వేశారు. అయితే ఇంత జరిగినా ఆమె ఇంటికి వెళ్లిపోకుండా మళ్ళీ క్యూలైన్లో నిలబడింది. అది చూసి పోలీసులు మరింత షాకయ్యారు.