భార్య ఇంటికి రావట్లేదని నడిరోడ్డుపై నిలువెల్లా కాలిపోతూ.. - MicTv.in - Telugu News
mictv telugu

భార్య ఇంటికి రావట్లేదని నడిరోడ్డుపై నిలువెల్లా కాలిపోతూ..

May 15, 2020

burn

హైదరాబాద్‌ నగరంలో ఘోరం జరిగింది. భార్య ఇంటికి రావడం లేదని మనస్తాపానికి లోనైనా భర్త నడిరోడ్డుపై శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుదర్శన రెడ్డి నగర్‌ జరిగింది. భువన్ సూర్య(30), అతని భార్య, కూతురుతో సుదర్శన రెడ్డి నగర్ లో ఓ భవనంలో అద్దెకు ఉంటున్నాడు. భువన్ సూర్య నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నాడు. భార్య వారు అద్దెకుండే భవనంలోనే బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది. 

అయితే, వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. లాక్ డౌన్ లో ఇద్దరు ఇంట్లో ఉంటుండడంతో గొడవలు మరింత పెరిగాయి. దీంతో భువన్ సూర్య భార్య కూతురితో సహా తన అక్క ఇంటికి వెళ్ళింది. దీంతో భువనసూర్య ఆగ్రహానికి లోనయ్యాడు. పూటుగా తాగి ఓ మిత్రునితో కలిసి తన భార్య అక్క ఇంటికి వెళ్లి ఆమెను చితకబాదాడు. దీంతో ఆమె జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అక్క ఇంటి వద్దనే ఉండిపోయింది. భువన సూర్య ఇంటికి రమ్మని ఎన్నోవిధాలుగా ప్రయత్నంచినా ఆమె ఇంటికి రాలేదు. పైగా పోలీస్ కేసు కూడా పెట్టింది. దీంతో సూర్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య రావడం లేదనే బాధలో ఈరోజు మధ్యాహ్నం తాను అద్దెకు ఉంటున్న భవనం కింద రోడ్డుపై ఓంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్లతో నిప్పంటించున్నాడు. అతడు ఖాలిపోతుండడం చూసిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేసి అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.