భార్య నుంచి భర్త కూడా భరణం పొందొచ్చు : కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

భార్య నుంచి భర్త కూడా భరణం పొందొచ్చు : కోర్టు

July 2, 2022

భరణం అనేది విడాకుల తర్వాత భర్త నుంచి భార్యకు వస్తుందని మనలో చాలా మందికి తెలుసు. కానీ భార్య నుంచి భర్తకు కూడా భరణం వస్తుందని తెలియదు. ఈ విషయాన్ని శనివారం పుణెలోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఓ వృద్ధ దంపతుల విడాకుల కేసు సందర్భంగా కోర్టు ఈ అరుదైన తీర్పునిచ్చింది. వివరాలు.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు తనను తన భార్య విపరీతంగా వేధిస్తోందనీ, తనకు విడాకులతో పాటు భరణం ఇప్పించాలని 2019లో కేసు వేశాడు. వివాహమై 55 ఏళ్లయినా తానింకా ఇబ్బందిపడుతున్నానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిని విచారించిన కోర్టు తప్పు ఎవరివైపున్నా తప్పేనని విడాకులు మంజూరు చేసింది. అంతేకాక, విడాకులు, సంపాదన విషయంలో ఆడ, మగ తేడా చూపవద్దని వ్యాఖ్యానించింది. సంపాదనపరురాలైన భార్య తన మాజీ భర్తకు ప్రతీ నెలా రూ. 25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ‘హిందూ వివాహ చట్టం సెక్షన్ 24 ప్రకారం దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు విడాకులు ఇవ్వవచ్చు. అందులో భర్తకు ఎలాంటి ఆదాయం లేకుండా భార్య సంపాదిస్తున్నప్పుడు భర్త భరణం కోరవచ్చు. బాధిత భర్తలకు కూడా సమాన న్యాయం పొందే హక్కు ఉంద’ని పిటిషనర్ తరపు న్యాయవాది తీర్పు అనంతరం వెల్లడించారు.