Husband holding a snake that bit his wife in up
mictv telugu

భార్యను కాటేసిన పాము.. ఊహించని మంచి పని చేసిన భర్త

June 24, 2022

Husband holding a snake that bit his wife in up

యూపీలోని ఉన్నావ్ ప్రాంతంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మఖీ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ మహిళను పాము కాటేసింది. వెంటనే ఆమె విషయాన్ని భర్త రామేంద్రయాదవ్‌కు చేరవేసింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న భర్త.. కష్టపడి పామును పట్టుకుని సీసాలో బంధించాడు. అనంతరం పామును, భార్యను కలిపి ఆసుపత్రికి తరలించాడు. అక్కడ పామును చూసిన వైద్యులు.. దాన్నెందుకు తీసుకొచ్చావని ప్రశ్నించగా, రామేంద్రయాదవ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. ‘నా భార్యను ఏ పాము కాటేసిందో నాకు ఎలా తెలుస్తుంది. అది విషం పామా? లేక విషం లేని పామా? అన్నది మీరే చూసి చికిత్స చేయండి.

ఒకవేళ విషం పాము అయితే మీరు అది కనిపెట్టేలోగా నా భార్య ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పామును వెంట తెస్తే.. పాముకు తగ్గ ఇంజెక్షన్లు ఇస్తారన్న ఉద్దేశంతో బంధించి తెచ్చా. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే పాము కాటేస్తే ఏ పాము కాటేసింది? అది ఎలా ఉంటుంది? విషం పామా? కాదా? ఏ సైజులో ఉంది? వంటి ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టారు. అందుకే పామును పట్టుకొని తెచ్చా’నని సూటిగా చెప్పడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. తర్వాత అతను మీడియాతో మాట్లాడుతూ.. నా భార్య డిశ్చార్జీ అయిన తర్వాత పామును జాగ్రత్తగా అడవిలో వదిలిపెడతా. అప్పటివరకు అది ఊపిరి పీల్చుకునేలా మూతకు రంధ్రాలు చేశా’నని వెల్లడించాడు. కాగా, విషం పాము, విషం లేని పాములకు వేర్వేరు ఇంజెక్షన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే.