తన భార్యే అనుకొని భర్త బండి ఎక్కమన్నాడు. తన భర్తే కదా అని భార్య ఏమాత్రం చూసుకోకుండా బండి ఎక్కేసింది. అలా కొద్ది దూరం వెళ్లేసరికి వెనుక నుంచి భార్య ‘ఏమండి మన ఇంటికి వెళ్లే దారి ఇటు కదా. అటు వెళ్తున్నారేంటీ? అని అడిగింది. గొంతు ఏదో తేడా కొడుతోందని అనుమానించిన భర్త.. వెనక్కి తిరిగి చూసి ఖంగుతిన్నాడు. ఆవిడ కూడా ముందున్న వ్యక్తి ముఖం చూసి గతుక్కుమంది. కర్ణాటకలోని హవేరీ జిల్లా రాణెబెన్నూరులో బుధవారం సాయంత్రం ఈ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. భార్యతో వెళ్తున్న ఓ వ్యక్తి బైకులో పెట్రోల్ పోయించుకునేందుకు ఓ బంకు దగ్గర ఆగాడు. భార్య బండి దిగి కొద్ది దూరంలో నిల్చుంది. పెట్రోల్ కొట్టించాక భర్త భార్యను బండెక్కమన్నాడు. ఆవిడ ఎక్కి 5 నిమిషాలు ప్రయాణించాక వెనుక నుంచి భార్య.. మన ఇల్లు ఇటు కదా. అటెందుకు వెళ్తున్నారని ప్రశ్నించింది. గొంతు తేడా ఉండడంతో బిత్తరపోయిన భర్త హెల్మెట్ తీసి వెనక్కి తిరిగి చూడగా, తన భార్య కాదని తెలిసింది.
ఆవిడ కూడా హెల్మెట్ తీసి చూసి నాలిక కరుచుకుంది. దీంతో వెంటనే బైకును వెనక్కి తిప్పి తిరిగి పెట్రోల్ బంకుకు చేరుకున్నారు. అక్కడ వ్యక్తి భార్య, ఆమె భర్త ఇద్దరూ వెయిట్ చేస్తున్నారు. క్షణాల్లో పొరపాటు ఏవిధంగా జరిగిందో అర్ధం చేసుకున్నారు. తన భార్యలాంటి చీరే కట్టుకోవడంతో అతడు ఆమెను బండి ఎక్కమన్నాడు. తన భర్తలాంటి బైక్, బట్టలు, శరీర సౌష్టవం ఉండడంతో ఆమె కూడా ఆలోచించకుండా ఎక్కేసింది. అంతేకాక తన భర్త ధరించిన హెల్మెట్ ఉండడంతో ఆమెకు అనుమానం రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆ నలుగురితో పాటు బంకు సిబ్బంది కూడా పగలబడి నవ్వుకున్నారు.