బాలింతను ఈడ్చిపారేసిన నరమృగం (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

బాలింతను ఈడ్చిపారేసిన నరమృగం (వీడియో)

August 19, 2019

మనుషులు రానురాను గుండెలో తేమలేని రాళ్లలా తయారవుతున్నారు. కనీస మానవత్వం అన్న ఊసులేకుండా నిర్దయగా ప్రవర్తిస్తున్నారు. మహిళల పట్ల కాస్త కూడా గౌరవం లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు.. ఆమె పచ్చి బాలింత అని కూడా చూడకుండా ఓ నీచుడు అతి దారుణంగా  ఈడ్చి అవతల పారేశాడు. అమానవీయ ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొరెయా జిల్లా జాన​క్‌పూర్‌ బ్లాక్‌లోని బార్వానీ కన్య ఆశ్రమంలో ఈ దారుణం జరిగింది. 

స్కూల్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న మహిళ అక్కడే  ఓ గదిలో తన పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమెకు మూడు నెలల చిన్నారి కూడా ఉంది. హాస్టల్ సూపరెండెంట్ సుమిళ సింగ్‌ గదిని ఖాళీ చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చింది. ఈనెల 10 వరకు ఖాళీ చేయాలని హుకుం జారీచేశారు. ఖాళీ చేయడానికి ఆమె నిరాకరించింది. దీంతో సుమిళ సింగ్ తన భర్తను తీసుకుని వచ్చింది. సాటి మహిళ అని కూడా చూడలేదామె. ఆమె బాలింతరాలు అన్న విషయం కూడా మర్చిపోయింది. భర్తను ఆమెపూకి ఉసిగొలిపింది. 

మంచంపై పడుకున్న ఆమెను దుప్పటితో ఒక్కసారిగా కిందకు లాగి, బయట వరకు ఈడ్చుకెళ్లాడు. చిన్నారిని తీసుకొచ్చి కూడా రోడ్డుపై పడేశారు. ఆమె ఇంట్లో సామన్లు కూడా బయట పడేసి గదికి తాళం వేశారు. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 11న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సూపరెండెంట్ భర్తపై కేసు నమోదు చేశారు. త్వరలోనే అతడ్ని అరెస్ట్ కూడా చేస్తామని చెబుతున్నారు. సుమిళ సింగ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆమె స్థానంలో లీలావతి అనే మహిళను కొత్త సూపరింటెండెంట్‌గా నియమించారు.