కరోనాతో భర్త మృతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన భార్య  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో భర్త మృతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన భార్య 

October 23, 2020

Husband passed away by Coronavirus .. Wife who jumped from the top of the building.jp

మహమ్మారి కరోనా వైరస్ మరో కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. భర్త కరోనా సోకి మృతిచెందాడు. భర్త లేని ఈ లోకంలో తానెందుకు ఉండాలని భావించిందో ఏమో.. ఆయన భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో తోడు పంచుకున్న ఆ ఇల్లాలు చావులోనూ భర్తకు తోడుగా వెళ్లడం స్థానికులను కంటతడి పెట్టించింది. అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని నేరెడ్‌మెట్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా నేరెడ్‌మెట్ సైనిక్‌పురి అంబేద్కర్ నగర్‌కు చెందిన తడకమళ్ళ వెంకటేష్ వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. కరోనా ఉందని బంధుమిత్రులు ఎవరూ వారి ఇంటికి రావాలంటేనే భయపడ్డారు. 

అయినా ధైర్యంగా వెంకటేష్ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య ధనలక్ష్మి భర్తకు ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించటంతో ఆయన మృతిచెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది ధనలక్ష్మి. భర్త లేని ఈ బతుకు తనకు వద్దు అనుకుంది. వెంకటేష్ మృతదేహం ఇంట్లో ఉండగానే బిల్డింగ్ పైకి వెళ్లి అక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఇద్దరి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కరోనా నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.