హానీమూన్‌లో జరిగిన ప్రమాదం వధూవరుల కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. చెన్నైకి చెందిన అరవింద్, ప్రీతి వారం రోజుల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హనీమూన్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి వెళ్లారు. మనాలిలో చెక్కర్లు కొడుతుండగా.. ప్యారాగ్లైడింగ్ చేస్తున్న కొందరు ఔత్సహికులు అరవింది కంట పడ్డారు. దీంతో తనకు కూడా ప్యారాగ్లైడింగ్ చేయాలి అనిపించింది. ప్రీతిని కిందే ఉంచి పైలట్ హరూరామ్‌తో ప్యారాగ్లైడింగ్ విహారానికి వెళ్లాడు.
ప్రీతి కింద నుంచి ఆసక్తిగా చూస్తుంటే, గాల్లో చక్కర్లు కొట్టాడు. ఇంతలో అరవింద్ నడుముకు కట్టుకున్న బెల్ట్ ఊడిపోగా, కింద ఉన్న పల్లంలో పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. హరూరామ్, వేగంగా కిందకు దిగి గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భద్రతా బెల్ట్‌ను సరిగ్గా కట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు.