Husband's permission not required for termination of pregnancy: High Court
mictv telugu

గర్భం తొలగించడానికి భర్త అనుమతి అవసరం లేదు : హైకోర్టు

September 27, 2022

Husband's permission not required for termination of pregnancy: High Court

వివాహిత గర్భంపై కేరళ హైకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. ఒకవేళ భార్య గర్భం తొలగించాలనుకుంటే అందుకు భర్త అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. 21 ఏళ్ల వివాహిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా స్పష్టం చేసింది. వివరాల్లోకెళితే.. కొట్టాయంకు చెందిన యువతి ఓ వ్యక్తిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత అత్తగారింటికి కాపురానికి వెళ్లగా, ఈ క్రమంలో గర్భం దాల్చింది.

అప్పటినుంచి భర్త, అత్తలు కలిసి ఆమెపట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె ప్రవర్తనపై భర్త అనుమానం వ్యక్తం చేసి, ఎలాంటి సాయం చేయకుండా వేధించాడు. రోజురోజుకీ వారి అమానుష ప్రవర్తనతో విసిగిపోయిన వివాహిత తిరిగి తన పుట్టింటికి చేరుకుంది. గర్భాన్ని తొలగించేందుకు ఆస్పత్రికి వెళ్లగా భర్తతో విడిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారు అబార్షన్‌కు తిరస్కరించారు. దీంతో వివాహిత హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లయ్యాక భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పుల వల్ల వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యాయని, తనతో జీవించేందుకు తన భర్త ఎలాంటి ఆసక్తి కనబరచలేదని పిటిషన్‌లో పేర్కొంది. విచారించిన జస్టిస్ వీజీ అరుణ్ నేతృత్వంలోని బెంచ్.. గర్భధారణ, డెలివరీ ఒత్తిడి, బాధను భరించాల్సింది మహిళనే కాబట్టి అబార్షన్‌కు అనుమతిస్తున్నామని వెల్లడించింది. అలాగే భర్త అనుమతి అవసరమని ప్రెగ్నెన్సీ చట్టంలో కూడా లేదని తెలిపింది. కొట్టాయంలోని మెడికల్ కాలేజీతో పాటు మరే ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకునేందుకు అనుమతినిచ్చింది.