HYD NEW TRAFIC RULES
mictv telugu

హైదరాబాద్‌‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. వారికి ఇక చుక్కలే..

November 2, 2022

HYD NEW TRAFIC RULES

నెంబర్స్ ప్లేట్స్ లేకుండా రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరిగే వాహనదారులపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు.నిబంధనలు ఉల్లంఘించి ఫైన్ల నుంచి తప్పించుకునేందుకు విచిత్ర మార్గాలను అనుసరిస్తున్న వారి పనిపట్టనున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు నెంబర్ ప్లేట్లు తొలగించి, నెంబర్ ప్లేట్లకు స్టికర్లు, మాస్కులు అంటించి యదేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతున్న వారికి పోలీసులు హెచ్చరిక జారీ చేసారు. నెంబర్లు కనిపించని వాహనాలను ఇక సీజ్ చేసి క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీ మూల్యం తప్పదని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాధ్ హెచ్చరించారు.

కొద్దిరోజుల క్రితం అమల్లోకి వచ్చిన సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్ దాటడం రూల్ కూడా పక్కాగా పాటించాలన్నారు. స్టాప్ లైన్ దాటడం వల్ల ట్రాఫిక్ స్తంబించడమే కాకుండా పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ సమస్యలు అధిగమించేందుకు స్టాప్ లైన్ ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి సారించామని.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.