తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని వాహనదారులకు పోలీస్ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. మూసారాంబాగ్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా మూసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలను మూసివేశామని తెలిపారు. కావున వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, అధికారులకు సహకరించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది పొంగిపోర్లుతోంది. దీంతో మూసారాంబాగ్ వంతెన పైనుంచి భారీ వరద నీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వంతెనకు రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అంబర్ పేట్, మలక్పేట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనలు మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోపక్క మూసానగర్, కమలానగర్ పరిసరాలను మూసీ వరదనీరు చుట్టుముట్టింది. అంబర్పేట్, మలక్పేట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రత్నానగర్, పటేల్ నగర్, గోల్నాకలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదర్సా, శంకర్ నగర్, మూసానగర్ నుంచి సుమారు 2వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హరేకృష్ణ సంస్థ ద్వారా ఆహారం సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు.