సాధారణంగా వానాకాలంలో, నీటి నిల్వలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విజృంభించే దోమలు మండే వేసవిలోనూ హైదరాబాద్ వాసుల రక్తం పీలుస్తున్నాయి. ఉడికించే ఉక్కపోతతో పాటు దోమలు కూడా తోడవడంతో రాత్రిళ్లు కంటిమీద కునుకు లేక జనం ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఖతర్ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తి.. తన కుటుంబం దోమల వల్ల పడే ఇబ్బందులను మంత్రి కేటీఆర్‌కు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
అంబర్‌పేటలోని ఖాద్రీబాగ్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి.. ‘కేటీఆర్ సార్.. ఇటీవలే ఖతర్ నుంచి హైదరాబాద్ వచ్చాం. మేం ఉంటోన్న ప్రాంతంలో దోమలు చంపేస్తున్నాయి. మా పిల్లల శరీరమంతా దోమకాట్లే. నివారణ మందు చల్లించాలని విజ్ఞప్తి అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. వీటిని జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎంఓ తెలంగాణ, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్నూ ట్యాగ్ చేశారు.
అతని ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ… వెంటనే చర్యలు చేపట్టింది. ఎంటమాలజీ విభాగం సిబ్బంది సోమవారం ఖాద్రీబాగ్‌కు వెళ్లి ఇమ్రాన్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో దోమల మందు పిచికారి చేశారు. రాత్రి వేళ ఫాగింగ్ కూడా చేయనున్నట్టు అధికారులు చెప్పారు.