Hyderabad And Vizag need not worry about earthquakes
mictv telugu

భూకంపం వస్తే Hyd వైజాగ్ నగరాల పరిస్థితి ఏంటి? రెండు రాష్ట్రాలు సేఫేనా?

February 9, 2023

తుర్కియే, సిరియాలలో వరుస భూకంపాలతో ప్రాణ నష్టం 15 వేలకు చేరింది. అంతకుమించి సంఖ్యలో గాయపడ్డవారు ఉన్నారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. మనదేశం సహా మిగతా దేశాలు స్పందించి సామాగ్రిని, సహాయక సిబ్బందిని పంపించి మానవత్వం చాటుకున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో భూకంపాల పరిస్థితి ఎలా ఉంది? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి? పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.

 తెలుగు రాష్ట్రాలు

అదృష్టవశాత్తూ రెండు తెలుగు రాష్ట్రాలు భూకంపాలు తక్కువగా వచ్చే జోన్ 2లో ఉన్నాయి. హైదరాబాద్, విశాఖ వంటి నగరాలకు భూకంప భయం చాలా తక్కువ. ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణలో మూడొంతుల భూభాగం, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే జోన్‌ 2 పరిధిలో ఉన్నాయి. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, విజయవాడ, ఖమ్మం, క‌ృష్ణా, గుంటూరు జిల్లాలు జోన్ 3 లో ఉన్నాయి. అంటే జోన్ 2తో పోలిస్తే వీరికి భూకంపాలు వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి. 1969లో భద్రాచలం సమీపంలో వచ్చిన భూకంపం వల్ల కిన్నెరసాని రిజర్వాయర్‌పై ప్రభావం పడింది. ఒంగోలులోని 30 మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

భారత దేశం

కాశ్మీర్, గువహటి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాణా ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు జోన్ 5 లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలు జోన్ 3లో, దక్షిణ భారతదేశం, గోవా, ఒడిషా వంటి రాష్ట్రాలు జోన్ 2, 3 ల పరిధిలో ఉన్నాయి.
అటు, తెలంగాణ దక్కన్ పీఠభూమిపై ఉంది కాబట్టి భూకంపాలు రావని అనుకోవద్దు. ఎందుకంటే దక్కన్ పీఠభూమిలోనే ఉన్న మహారాష్ట్రలోని లాతూరులో 1993లో అతిపెద్ద భూకంపం వచ్చింది. సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాతనే ప్రకృతి విపత్తుల సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలో 2021లో భూమి కంపించింది. అమ్రాబాద్, అచ్చంపేట్, ఉప్పునుంతల వంటి నల్లమల అడవికి సమీపంలో ఉండే ప్రాంతంలో 4.0 తీవ్రత కలిగిన భూకంపం వచ్చింది. సుమారు 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపిన భూకంపం తీవ్రత స్వల్పంగా ఉండడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

భూకంపాలు వచ్చినప్పుడు సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు

భూకంపాలను మనం ఆపలేం. ఎప్పుడు వస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు కనుక భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో నివసిస్తున్నట్టయితే ఎమర్జెన్సీ ప్యాక్‌ని సిద్ధంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. అందులో కొంత ఆహారం, డబ్బు, ముఖ్యమైన పత్రాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్‌లైట్ వంటివి ఉండాలి. భూకంపం వచ్చినప్పుడు ఉన్నచోటనే ఉంటే గాయాలు అంతగా కావు. సమీపంలో ఉండే టేబుల్, మంచాల కింద దాక్కోవాలి. దాంతో కూలే భవన శిథిలాల నుంచి గాయాల పాలు కాకుండా రక్షించుకోవచ్చు. అలాగే భూకంపం వస్తే ముందుగా, అద్దాలు, కిటికీలు, తలుపులు టీవీ వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ముందుగా దెబ్బతింటాయి కాబట్టి వాటి వద్ద ఉండొద్దు. బయటకు పరిగెత్తడం, గదుల్లోకి వెళ్లడం వంటివి చేయవద్దని అమెరికా జియోలాజికల్ సర్వే చెప్తోంది. ఒకవేళ బయట ఉంటే మాత్రం ఎక్కడికక్కడ ఆగిపోవాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, చమురు నిల్వలు, సెల్ టవర్లు లేని ప్రాంతాలు సురక్షితం. అంతేకాక గ్యాస్ పైప్‌లైన్ నుంచి దూరంగా ఉండాలి. వాటి వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.