Hyderabad: Balapur Ganesh laddu auctioned for Rs 24.60 lakh
mictv telugu

మరోసారి రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్‌ గణేశ్ లడ్డూ

September 9, 2022

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ 18.90 లక్షలు పలుకగా.. ఈ ఏడాది ఏకంగా రికార్డ్ స్థాయిలో 24.60 లక్షలు పలికింది. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు.

బాలాపూర్‌ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం తొమ్మిది పాల్గొన్నారు. వారిలో ఆరుగురు స్థానికులు ఉండగా, ముగ్గురు స్థానికేతరులు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. లడ్డూను సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డికి బాలాపూర్ గణేశ్ మండపం నిర్వాహకులు లడ్డూను అందించారు. ఆయనకు శాలువాను కప్పి సన్మానం చేశారు. కాగా, వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు. మరోవైపు బాలాపూర్‌ వీధుల్లో గణేశుడి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది.