హైదరాబాద్ చుట్టుపక్కల వారికి హెచ్చరిక.. వాటిని తాకొద్దు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ చుట్టుపక్కల వారికి హెచ్చరిక.. వాటిని తాకొద్దు

January 20, 2020

hyderabad.

హైదరాబాద్ వాసులకు శాస్త్రవేత్తలు హెచ్చరిక జారీ చేశారు. శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఈనెల 10 నుంచి 30వ తేదీ మధ్య ఆకాశంలోకి వదిలే బెలూన్‌లు భూమిపై పడిపోయి కనిపిస్తే వాటిని తాకకుండా, సమాచారాన్ని పోలీస్‌స్టేషన్‌ లేదా దానిపై ఉన్నఫోన్‌ నెంబర్‌కు ఇవ్వాలని ఆటోమిక్‌ ఎనర్జీ, ఇస్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెలూన్‌‌లోని కొన్ని పరికరాల్లో హై ఓల్టేజ్‌ విద్యుత్‌ ప్రవహిస్తుందన్నారు. చాలా విలువైన సైంటిఫిక్‌ డేటా అందులో ఉంటుందని, ఎవరైనా దానిని తెరిస్తే డేటా చెదిరిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. 

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ అధికారులు శాస్త్రీయ పరిశోధనల కోసం 10 బెలూన్‌ ఫ్లయిట్స్‌ను ఆకాశంలోకి వదలనున్నారు. ఈ బెలూన్లలో హైడ్రోజన్‌ గ్యాస్‌ను నింపుతారు. దాంతోపాటే పరిశోధనలకు అవసరమైన కొన్ని పరికరాలను కూడా అందులో అమర్చుతారు. మొదటి బెలూన్‌ను ఇప్పటికే ఈనెల 3వ తేదీన ఆకాశంలోకి వదిలారు. భూమికి 30 నుంచి 42 కి.మీ. ఎత్తులో వీటిని పరిశోధనల కోసం ఆకాశంలోకి వదిలారు. ఒక్కో బెలూన్‌లో అమర్చిన శాస్త్రీయ పరికరాలు 10గంటల పరిశోధనల తర్వాత భూమిపైకి దిగుతాయి.

hyderabad

ఈబెలూన్‌లు హైదరాబాద్‌ నగరానికి 200 నుంచి 350కి.మీ. రేడియస్‌లో భూమిపైకి చేరుకుంటాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, షోలాపూర్‌, ఉత్తర కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఇవి కిందికి దిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల్‌, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల్‌, మెదక్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌, యదాద్రి జల్లాల్లో ఈ బెలూన్‌లు భూమిపైకి చేరే అవకాశం వుంది.