మేం ఖైదీలం కాదు.. బయటికి వదలండి.. - MicTv.in - Telugu News
mictv telugu

మేం ఖైదీలం కాదు.. బయటికి వదలండి..

December 16, 2017

స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం విప్లవాలే జరిగాయి చరిత్రలో. మానవుడు స్వేచ్ఛాజీవి. బంధనాలను సహిచలేడు. ఇది కోట్లు కూడేసిన ధనికుడికీ వర్తిస్తుంది. చిప్పపట్టి అడుక్కునే బిచ్చగాడికీ వర్తిస్తుంది. స్వేచ్ఛ అంత గొప్పది మరి. హైదరాబాద్ బిచ్చగాళ్లు కూడా అలాంటి స్వేచ్ఛ కోసం తనకలాడుతున్నారు.

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు కోసం నగరంలోని బిచ్చగాళ్లను తీసుకెళ్లి ఊరిబయటి జైళ్లలోఉంచడం తెలిసిందే. ఇవాంకా వెళ్లిపోయాక వాళ్లను మళ్లీ రోడ్లపైన పడేశారు. అయితే నగరాన్ని యాచకరహితగా మార్చడానికి అంటూ  పునరావాసం పేరుతో మళ్లీ పట్టుకెళ్తున్నారు. బిచ్చగాళ్ల ఆచూకీ చెబితే రూ. 500 ఇస్తామని చెబుతున్నారు. ఇదంతా తెలిసిన ముచ్చటే. మరి ఇలా అధికారులు పట్టుకెళ్లి చర్లపల్లి జైల్లోని ఆనందాశ్రమంలో పడేసిన వందలాది బిచ్చగాళ్ల మనోగతాలంటే వాళ్ల మాటల్లోనే చదవండి..

కమలాబాయి(60)

అయ్యా.. నాకు మస్తు బంధువులు ఉన్నారు. నాకు ఇక్కడ అన్నీ సమకూరుస్తున్నారు. సమయానికి తిండి పెడుతున్నారు. కొత్త బట్టలు ఇచ్చారు. సబ్బులు ఇచ్చారు. ఏది అడిగితే అది ఇస్తున్నారు.. కప్పుకోవడానికి దుప్పటి ఉంది. మంచం, మెత్తని పరుపు కూడా ఉన్నాయి. .. కానీ స్వేచ్ఛ లేదు.. ఈ బిల్డింగ్ నుంచి బయటకు పంపడం లేదు. గేట్లకు తాళం వేస్తున్నారు. నేను ఇలా బతకలేను.. నాకు కాళ్లూ చేతులూ ఆడ్డం లేదు.

ఈశ్వరమ్మ

నన్ను ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు పోలీసులు కొట్టారు. అయితే ఇక్కడికొచ్చాక బాగానే చూసుకుంటున్నారు. మందుమాకులు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడుండడం నా వల్ల కాదు.. రేపోమాపో మావాళ్లు వస్తారు.. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు.. నేనేం తప్పు చేశానని నన్ను జైలుకు పట్టుకొచ్చారు?  

నాగరత్న..

నేను బిచ్చగత్తెను కాదు మొర్రో అంటున్నా ఈడ్చుకొచ్చి పడేశారు. మాది అనంతపురం. చిన్నాచితకా పనులు చేసుకుంటూ బతుకుతున్నాను..  మా వాళ్లు వస్తారు.. నేను తొందరగానే పోతాను.. నాకు నరకంగా ఉందిక్కడ..