నాన్ వెజ్ ప్రియులకు హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రుచికరమైన ఆ బిర్యానీని టేస్టే చేయాలని ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ రుచిని చూసేందుకు క్యూ కడుతుంటారు. ఆ ప్రత్యేకతే ఓ అంతరాష్ట్ర దొంగను పోలీసులకు పట్టించింది. అదెలా అంటే.. మలక్‌పేట పరిధిలోని వెంకటాద్రినగర్ కాలనీలో నివాసముంటున్న కారు మెకానిక్ సయ్యద్ ఇఫ్తేకారుద్దీన్ మే 14 రాత్రి కుటుంబంతో కలసి ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన సమయంలో ఇంటికి వచ్చి చూడగా… తాళాలు పగులకొట్టి ఉండడం చూసి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన క్రైంపోలీసులు చోరీ జరిగిన ఇంటి సమీపంలో నమోదైన మొబైల్ కాల్ డేటాను సేకరించారు. మొబైల్ నంబర్ గురించి ఎంక్వయిరీ చేయగా.. అది కర్ణాటకలోని మైసూర్ హలే కేసరేలో నివాసముంటున్న సయ్యద్ ఐజాజ్ ఎలియాస్ (27)గా గుర్తించారు.
నిందితుడిగా ఎలా తేల్చారంటే..
నగరంలో తాళం వేసిన ఇళ్లే ఇమ్రాన్ టార్గెట్. ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన నగలు, నగదును దోచుకొని వెళ్తుంటాడు. అయితే దోచుకున్న నగలు, నగదుతో తిరిగి వెళ్లే సమయంలో అతనికి ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీని ఆరగించడం అలవాటు. పలు సందర్భాలలో మలక్‌పేట సోహైల్ హోటల్ నుంచి జొమాటో ద్వారా మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్‌కు బిర్యానీ తెప్పించుకుంటాడు. ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. ఇందుకు సంబంధించిన ట్రాన్సక్షన్లన్నీ ఇమ్రాన్ మొబైల్ నంబర్ ద్వారానే జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కాల్‌డేటా ఆధారంగా మలక్‌పేట క్రైం ఇన్స్పెక్టర్ నానునాయక్‌తో కూడిన క్రైం పోలీసుల బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్ ఐజాజ్ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా గుర్తించారు.