‘‘పండగ పూట కూడా పాత మొగుడేనా?’’ అని ఓ ఘాటు మోటు సామెత ఉంది. దాని వెనక చాలా చరిత్ర ఉందని పరిశోధకులు అంటారు. ఆ సంగతి వదిలేస్తే పాత వాటికి ఎక్కడా విలువ ఉండదు. అన్నీ కొత్తగా మెరిసిపోవాల్సిందే. ‘‘ఏందయ్యా చంద్రం, ఏమిటి విశేషం? కొత్త ఇల్లు, కొత్త కారు..ఆఆ’’ అనే యాడ్ డైలాగ్‌లా అన్నమాట. ఇక పెళ్లి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.
అసలు కొత్తవాటిని కొనుక్కోవడానికే పెళ్లి చేసుకుంటున్నారో అన్నట్లు కొనేస్తుంటారు. కొత్త బట్టలు, కొత్త నగలు, కొత్త గృహోపకరణాలు.. ఎన్నో ఎన్నోన్నో. కొత్త మంచాలు కూడా కామనే. కట్నం కింద తనకు కూడా రివాజుగా కొత్త మంచం ఇస్తారని ఆశపడ్డ ఓ వరుడు.. పాత మంచం ఇవ్వడంతో అసలుకే ఎసరు పెట్టి పెళ్లి వద్దనేశాడు. ఈ వింత సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.
అది ఇద్దరికీ రెండో పెళ్లికావడం ఒక విశేషమైతే తొలి పెళ్లిలో కట్నం కింద ఇచ్చిన మంచాన్నే రెండో పెళ్లి వరుడీకీ ఇచ్చేయడం మరో విశేషం.
మౌలాలీకి చెందిన జకారియా అనే డ్రైవర్‌కు, బండ్లగూడ రహ్మత్ కాలనీకి చెందిన ఓ అమ్మాయితో ఈ నెల 13న నిశ్చితార్థం జరిగింది. గత ఆదివారం మధ్యాహ్నం పెళ్లి జరగాల్సి ఉండింది. ఆచారం ప్రకారం.. వధువు కుటుంబం వరుడికి పెట్టిపోతుల్లో భాగంగా బీరువాలు, బొచ్చెలు, టేబుళ్లు, మంచం అన్నీ ఇచ్చారు.
మంచాన్ని బిగిస్తుండగా పుటుక్కున విరిగిపోయి బండారం బయటపడింది. పాత మంచికే కొత్తగా రంగులు వేసి ఇచ్చారంటూ వరుడు అలిగాడు. పెళ్లి ముహూర్తానికి వేదిక వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుండిపోయాడు. వధువు బంధువులు కాళ్లవేళ్లా పడినా లాభం లేకపోయింది. పాత మంచమిచ్చి అవమానించారని, పెళ్లి కేన్సిల్ అని అన్నాడు. దీంతో ఒళ్లుమండిన వధువు కుటుంబసభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వరుడిపై 420 కేసు పెట్టారు.