పసిబిడ్డపై అత్యాచారం.. వాడిని కఠినంగా శిక్షించాలి: చిరంజీవి - MicTv.in - Telugu News
mictv telugu

పసిబిడ్డపై అత్యాచారం.. వాడిని కఠినంగా శిక్షించాలి: చిరంజీవి

October 26, 2022

Hyderabad: Chiranjeevi reacted to the DAV school incident.

 

హైదరాబాద్‌ నడిబొడ్డున బంజారాహిల్స్ లోని DAV పబ్లిక్ స్కూల్లో చిన్నారిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్కూలు ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఘటనపై బాధ్యులైన ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. దీనిపై సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా సీరియస్ గా స్పందిస్తున్నారు. తాజాగా ఒక చిన్నారిపై జరిగిన ఆత్యాచారం ఘటన తనను కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు.

“నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం,అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను..” అని తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి ఘోరాలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.