హైదరాబాద్ సిటీ బస్సులు ప్రారంభం.. ప్రస్తుతానికి..   - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ సిటీ బస్సులు ప్రారంభం.. ప్రస్తుతానికి..  

September 23, 2020

Hyderabad city buses restarts amid covid threat .

హైదరాబాద్ నగర ప్రజల ఎదురు చూపులు కొద్దిగా ఫలించాయి. ఈ రోజు నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే కేవలం సిటీ శివారు ప్రాంతాలకే సర్వీసులు నడుపుతున్నారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ  ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు తిరుగుతున్నాయి. ఒక్కో  డిపో నుంచి 12 బస్సులను తిప్పుతున్నారు. దశలవారీగా సిటీ అంతటా తిప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్టీసీ దీనిపై స్పష్టమైన ప్రకటనేదీ చేయలేదు. ఏపీకి బస్సులు తిప్పే విషయం కూడా కొలిక్కి రావడం లేదు. 

అన్‌లాక్ 4.Oలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులను ఈ నెల 7 నుంచి తిరిగి ప్రారంభించడం తెలిసిందే. దీంతో ప్రయాణికుల అవస్థలు కొద్దిగా తప్పాయి. సమీప ప్రాంతాల్లోని కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటూ ఆర్టీసీ బస్సులను తిప్పాలని కోరుతున్నారు.  బస్సుల్లో ఒక సీటు విడిచి ఒక సీట్లో ప్రయాణికులను అనుమతించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే ఆదాయం తగ్గుందనే ఆందోళన కూడా నెలకొంది.