దసరా, దీపావళి పండగలకు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్, కానుకలు ఇస్తుంటాయి. ఏదో ఒకటి ఇవ్వాలని నామ్ కే వాస్తేగా ఇస్తుంటారు కొందరు. కొందరైతే ఇచ్చేది బాగా గుర్తిండిపోవాలని ఖరీదైన కానుకలే ఇస్తుంటారు. సూరత్‌లోని వజ్రాల వ్యాపారులు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా లగ్జరీ కార్లే కానుకలుగా ఇస్తుంటారు. ఈ ట్రెండ్ హైదరాబాద్‌కు కూడా పాకింది. హైదరాబాద్ జూబిలీ హిల్స్‌లోని సంపంగి గ్రూప్ అనే కంపెనీ తన ఉద్యోగులకు సంక్రాంతి సందర్భంగా మాంచి గిఫ్ట్ ఇచ్చింది. ఎంపిక చేసిన పదిమంది ఉద్యోగులకు కార్ల తాళాలు ఇచ్చి పండగ చేస్కోండి అని సర్ప్రైజ్ కానుకలు అందించింది. వారు కంపెనీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని, అందుకు గుర్తుగా ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు చైర్మన్ రమేశ్ సంపంగి తెలిపారు. తమ కంపెనీలో భాగమైన అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలన్నదే తమ కోరిక అని చెప్పారు.