1,394 కోట్లు ఎగ్గొట్టిన హైదారాబాద్ కంపెనీ - MicTv.in - Telugu News
mictv telugu

1,394 కోట్లు ఎగ్గొట్టిన హైదారాబాద్ కంపెనీ

March 22, 2018

బ్యాంకు నేరాల డొంక కదులుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ భారీ పట్టుకుచ్చుటోపీ పెట్టిన విషయం వెలుగు చూడ్డంతో దర్యాప్తు సంస్థలు బ్యాంకు కుంభకోణాలను తవ్వుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టోటెం ఇన్ ఫ్రాస్టక్చర్ కంపెనీ.. 8 బ్యాంకుల నుంచి రూ. 1394 కోట్లు దోచుకున్నట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ డైరెక్టర్, ప్రమోటర్ అయిన తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంను టోటెం మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆ కంపెనీ కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ కంపెనీ ఒక్క యూబీఐకే రూ. 303 కోట్లకు ముంచినట్లు అధికారులు తెలిపారు. ‘టోటెం రుణాలు తీసుకుని ఎగ్గొట్టింది. దీంతో 2012 జూన్ 30న ఆ రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు.

రుణాలను ఎందుకు చెల్లించలేదో దర్యాప్తు చేస్తున్నాం. ఇంత భారీ మొత్తాన్ని ఎగ్గొట్టడం వెనుక బ్యాంకుల పాత్ర కూడా ఉండొచ్చు. తీసుకున్న రుణాలను దారి మళ్లించారు. కంపెనీ వ్యయాలను ఊహించనంత భారీగా పెంచి నష్టాలు వచ్చినట్లు చూపారు’ అని తెలిపారు. టోటెం కంపెనీ రోడ్డు, భవన నిర్మాణాలు తదితర ప్రాజెక్టులు చేపట్టింది. చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ కంపెనీ ఎస్పీఐ నేతృత్వంలోని 14 బ్యాంకులకు రూ. 824 కోట్లకు మోసం చేసిన సంగతి తెలిసిందే.