తెలంగాణ పోలీస్ విభాగంలో తొలి కరోనా మరణం
కరోనా రోగులను తమ కంటికి రెప్పలా కాపాడే యోధులకే ఆ మహమ్మారి సోకితే ఇక వారిని కాపాడేది ఎవరు? ఈ సంక్షోభంలో అందరికి తమ ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడుతున్నవారు క్షేమంగా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలపై పగబట్టినట్టే చేస్తున్న కరోనా.. తెలంగాణలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కబళించింది. దీంతో తెలంగాణ పోలీస్ విభాగంలో తొలి కరోనా మరణం నమోదైంది. కానిస్టేబుల్ మృతిపై పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి (37) 2007 బ్యాచ్‌కు చెందినవాడని అధికారులు వెల్లడించారు.
కొన్ని రోజుల క్రితం అతడు అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలు చేశారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే దయాకర్ రెడ్డి మృతిచెందారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ సోకి గత రాత్రి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ చనిపోయినట్లు ద్రువీకరించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీస్ శాఖ అండగా ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.