హైదరాబాద్‌లో తాగి చిందేసిన కానిస్టేబుల్..రోడ్డుపై హంగామా - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో తాగి చిందేసిన కానిస్టేబుల్..రోడ్డుపై హంగామా

December 3, 2019

Hyderabad 02

హైదరాబాద్ నగరంలో రక్షణ కరువైందని ఓ వైపు మహిళా సంఘాలు గగ్గోలుపెడుతున్నాయి. తాగుబోతులు రాత్రి వేళల్లో రెచ్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అటువంటి కేసులు అనేకం నమోదు అవుతున్నాయి. ఇలాంటి ఆకతాయిల ఆటకట్టించాల్సిన పోలీసుల్లో కొంత మంది కూడా అలాగే రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ఫూటుగా మద్యం తాగి ఒళ్లు మరిచి చిందేశాడు. రోడ్డుపై వెళ్లేవారిని దుర్భాషలాడుతూ ఇబ్బంది కలిగించాడు. అతడి చేష్టలు పోలీసుల ప్రతిష్టను మరింత దిగజార్చాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఫలక్‌‌నుమాకు చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య సోమవారం అర్థరాత్రి మద్యం తాగి హంగామా సృష్టించాడు. డ్యూటీలోనే తాగి రోడ్డుపై తూలుతూ వచ్చిపోయే వారికి ఇబ్బంది కలిగించాడు. ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అతన్ని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇంత జరుగుతున్నా దీనిపై అలసత్వం వహించిన ఫలక్‌నుమా సీఐకి చార్జి మెమో ఇచ్చారు. ఈ ఘటనపై ప్రజలు మండిపడుతున్నారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులే నగరం నడిబొడ్డున ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అలసత్వాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు.