ఎవరూ పెళ్లికి ఒప్పుకోలేడం లేదని పోలీస్ రాజీనామా  - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరూ పెళ్లికి ఒప్పుకోలేడం లేదని పోలీస్ రాజీనామా 

September 12, 2019

Hyderabad

అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో పోలీసుల కష్టాలు పీత కష్టాలు ఒకటే. తక్కువ సెలవులు, రిస్కు పనులు వారి సొంతం. ఇతర ఉద్యోగాలు చేసే వారితో పోలిస్తే పోలీసన్నలు కొన్ని సుఖాలు వదులుకోక తప్పదు. అందుకే ఆ అమ్మాయిలు ఆ పోలీసును పెళ్లాడ్డానికి నిరాకరించారు. అతడు కూడా ఈ తిరస్కృతులను సహించలేక ఏకంగా పోలీసు కొలువుకు రాజీనామా గీకిపడేశాడు. 

హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్  ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. పెద్ద కొలువు దొరక్క పోవడంతో పోలీసు ఉద్యోగంపై మక్కువ పెంచేసుకుని 2014లో అందులో చేరిపోయాడు. సెటిలయ్యాడు కదా అని ఇంటిపెద్దలు ఆయనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ అమ్మాయీ ఒప్పుకోవడం లేదు. పోలీసులకు తక్కువ సెలవులు, పని ఒత్తిడి, రిస్క్ పనులు, అరకొర ప్రమోషన్లు ఉంటాయని, సంపాదన కూడా పెద్దగా ఉండదని అమ్మాయిలు పెళ్లికి నిరాకరిస్తున్నారు. తాజాగా వచ్చిన సంబంధం కూడా ఇదే కారణంతో ఎగిరిపోయింది. ఈ ఉద్యోగంలోనే ఉంటే జీవితంలో అసలు పెళ్లే కాదేమోనని భయపడిన ప్రతాప్ ఉన్నతాధికారులకు విషయం పూసగుచ్చినట్లు చెబుతూ లేఖ రాశారు. తాను రాజీనామా చేస్తున్నానని కూడా చెప్పేశాడు.

 ‘ఎస్ఐలకు, ఉన్నతాధికారులకు మాత్రం ప్రమోషన్లు వస్తున్నాయి. కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడిగా అదే పోస్టులో ఉంటున్నారు. మా సీనియర్ కానిస్టేబుళ్లు కొందరు 30, 40 ఏళ్లపాటు ఆ పోస్టులోనే పదవీ విరమణ చేశారు. మాకు వీక్లీ ఆఫ్ లేదు. కొన్నిసార్లు సెలవులు కూడా దొరకవు.  ట్రాఫిక్ పోలీసులు రెగ్యులర్ డ్యూటీ తర్వాత రాత్రి మళ్లీ యాంటీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షలు చేయాల్సి వస్తోంది… ప్రభుత్వంలోని ఏ ఇతర శాఖల్లోనూ ఇలా లేదు.. ’ అని వాపోయాడు. ప్రతాప్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.