కోర్టుకు చేరిన పుల్లారెడ్డి స్వీట్స్ కుటుంబ వివాదం.. కోడలికి భద్రత - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టుకు చేరిన పుల్లారెడ్డి స్వీట్స్ కుటుంబ వివాదం.. కోడలికి భద్రత

May 26, 2022

నేతి మిఠాయిల వ్యాపారంలో ప్రఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వట్స్ యజమాని పుల్లారెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి కుటుంబ వివాదం కోర్టుకు చేరింది. గృహ హింస కేసులో కోర్టు పుల్లారెడ్డి అధినేత రాఘవరెడ్డి కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. కోడలు ప్రగ్నారెడ్డి తన భర్త ఏక్ నాథ్ రెడ్డి, మామ రాఘవ రెడ్డిలపై కోర్టులో ఫిర్యాదు చేయడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాక, ప్రగ్నరెడ్డికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. వివరాలు.. పుల్లారెడ్డి మనవడు, రాఘవరెడ్డి కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి ప్రగ్నారెడ్డి అనే యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజులు సాఫీగా సాగిన సంసారంలో ఆ తర్వాత కలహాలు ప్రారంభమయ్యాయి. ఏక్ నాథ్ రెడ్డి తన భార్యను ఇంటి నుంచి బయటకు రానీయకుండా నిర్భంధం చేశాడు. అంతేకాక, ఓ రోజు రాత్రి ఉన్నట్టుండి ఇంటి గుమ్మం ముందు గోడ కట్టించాడు. ఆ తర్వాత పారిపోయాడు. దీంతో విసిగిపోయిన ప్రగ్నారెడ్డి తన భర్తపై వరకట్న వేధింపులు, గ‌ృహ హింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు తనను ఇంకా గ‌ృహ నిర్బంధంలోనే ఉంచారంటూ హైదరాబాదు మొబైల్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. అంతేకాక, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు రాఘవ రెడ్డి, అతని భార్య, కుమారుడు ఏక్ నాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ప్రగ్నారెడ్డికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.