దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేటి నుంచే.. - MicTv.in - Telugu News
mictv telugu

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేటి నుంచే..

September 25, 2020

Hyderabad durgam cheruvu inauguration

భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. గ్లోబల్ నగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై నిర్మించిన ప్రతిష్టాత్మక భారీ కేబుల్ వంతెన ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ వంతెనను ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జిని అద్భుతమైన హైదరాబాద్ ప్రజలకు అంకింతం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుర్గం చెరువుకి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీలు కే కేశవరావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ఆరెకపూడి గాంధీ, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్ పలువురు అధికారులు‌ హాజరవుతారు. దీనితో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ను కూడా ప్రారంభిస్తారు. 

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర సుందరీకరణ పనుల్లో భాగంగా 754.38 మీటర్ల పొడవైన ఈ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించింది. దాదాపు రూ.184 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జి జూబ్లీహిల్స్, మాదాపూర్ మధ్య దూరాన్ని తగ్గించనుంది. ఈ కేబుల్‌ బ్రిడ్జి హైదరాబాద్‌ మొట్టమొదటి హ్యాంగింగ్‌ బ్రిడ్జిగా పేరొందనుంది. భారత్‌లో ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే బ్రిడ్జిల్లో అత్యంత పొడవైన మెయిన్‌ స్పాన్‌ (233.85 మీటర్లు) ఇదే ప్రథమం. గుజరాత్‌లోని భరూచ్‌లో నర్మద నదిపై 144 మీటర్ల పొడవైన మెయిన్ స్పానే ఇప్పటి వరకు పెద్దది. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా అమెరికా, యూరప్, రష్యా, హాంకాంగ్‌‌కు చెందిన పలు అంతర్జాతీయ ఇంజనీరింగ్‌ సంస్థల సహకారంతో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. కేబుల్స్‌ కొనుగోలు, వాటి సామర్థ్య పరీక్షలు ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో జరిగాయి. ఇందుకోసం రాష్ట్ర ఇంజనీర్లు యూకే, కొరియా డిజైనర్ల సహకారం తీసుకున్నారు. డిజైన్, నిర్మాణం ఈపీసీ పద్ధతిలోనే జరిగాయి. ఆగస్టు నాటికే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రత్యేక విద్యుత్‌ థీమ్‌ల కోసం మరికొంత సమయం పట్టింది.