Hyderabad: ED raids six locations in connection with Delhi Liquor scam
mictv telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

September 6, 2022

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో ఈ సోదాలు సాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే ఆరు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేస్తున్నారు. రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.

మంగళవారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. సోదాలు జరుపుతున్న విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. రాబిన్ డిస్ట్రిలర్స్ పేరుతో అరుణ్ రామచంద్రన్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరుతో పాటు హైదరాబాద్‌లో రామచంద్రన్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రన్‌కు సంబంధించిన కంపెనీతో పాటు ఇంట్లో కూడా ఈడీ దాడులు చేపట్టింది.

తాజా సోదాలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా స్పందించారు. ‘‘తొలుత సీబీఐ దాడులు చేసింది. వారికి ఏం లభించలేదు. ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వారికీ ఏం దొరకదు. అరవింద్‌ కేజ్రీవాల్ చేస్తోన్న మంచి పనులను ఆపేందుకు చేసే ప్రయత్నాలే ఇవన్నీ. సీబీఐ, ఈడీలను ఉపయోగించినా సరే.. మమ్మల్ని వారు(భాజపాను ఉద్దేశిస్తూ) అడ్డుకోలేరు’’ అని సిసోదియా కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి గత నెల సిసోదియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.