దేశంలోనే మొదటి సారి అదీ తెలుగు నేలపై తొలిసారిగా హైదరాబాదులో నిర్వహించిన ఫార్ములా – ఈ గ్రాండ్ ప్రి రేసు ముగిసింది. శనివారం సాయంత్రం ముగిసిన ఈ రేసులో ఫ్రాన్స్‌కి చెందిన జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో న్యూజిలాండ్‌కి చెందిన నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కి చెందిన సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ రేసులు 2014లో ప్రారంభమవగా, వెర్నే అప్పటినుంచి అగ్రస్థాయిలో కొనసాగుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు రెండు సార్లు ఫార్ములా – ఈ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అటు ఈ పోటీల్లో మన దేశానికి చెందిన మహీంద్రా, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీంలు పాల్గొన్నాయి. మహీంద్రాకి చెందిన ఒలివర్ రోలాండ్ 6వ స్థానంలో, లూకాస్ డి గ్రాస్సి 14వ స్థానంలో నిలిచాడు. జాగ్వార్ టీసీఎస్ టీంకు చెందిన శామ్ బర్డ్ తన కారుతో మిచ్ ఇవాన్స్ కారును ఢీకొట్టడంతో ఇద్దరి కార్లను రేసింగ్ నుంచి తొలగించారు. కాగా, తర్వాతి రేసు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మరో రెండు వారాల్లో జరుగనుంది.