Home > Featured > సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబర్ రాసలీలలు.. ఉద్యోగాల పేరుతో ఉచ్చు.. 

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబర్ రాసలీలలు.. ఉద్యోగాల పేరుతో ఉచ్చు.. 

Tamil nadu...

చేతిలో ఫోన్ వుంది.. చదువు వుంది.. ఇంగ్లీష్‌లో బాగా మట్లాడగలడు.. అంతర్జాలంపై పట్టు వుంది.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగమూ వుంది. అయినా అతనికి అంతటితో సంతృప్తి కలగలేదు. ఇన్ని అర్హతలు వున్న తాను ఇంకేదో చేయాలని బలంగా అనుకున్నాడు. ఈ క్రమంలో అతనికి వక్రబుద్ధి పుట్టింది. రంగంలోకి దిగాడు.. మహిళల బలహీనతలను ఆసరా చేసుకుని వారినుంచి నగ్నచిత్రాలను సేకరించాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారితో వీడియో ఛాటింగ్‌లో మాట్లాడి తన కామవాంఛ తీర్చుకున్నాడు. 6 రాష్ట్రాల్లోని సుమారు 2 వేల మందితో చెలగాటమాడాడు. ఈ విషయం బయట చెబితే తన వద్ద వున్న నగ్న ఫోటోలను అంతర్జాలంలో పెడతానని బెదిరింపులకు దిగేవాడు. కానీ, అతను అనుకున్నంత పకడ్బందీగా అతని అరాచకాలు దాగలేవు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అతడు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. దాదాపు 300 మంది అతడి ఉచ్చులో పడి విలవిల్లాడిపోయారు.

తమిళనాడు తిరువొత్తియూర్‌కు చెందిన క్లెమెంట్‌ రాజ్‌ అలియాస్‌ ప్రదీప్‌(33) ఎన్‌ఎంసీ చెన్నై బ్యాంకు కాలనీలో ఉంటున్నాడు. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. రాత్రి పూట విధులు నిర్వర్తిస్తుంటాడు. 2011లో వివాహం చేసుకున్న అతడికి ఏడేళ్ల కుమారుడు వున్నాడు. భార్య ఉద్యోగానికి వెళ్లే క్రమంలో పగటి పూట ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు. దీంతో అతనికి ఇంకా ఏదో చేసి డబ్బు మూట గట్టుకోవాలని వికృత ఆలోచన పుట్టింది. ఈ క్రమంలో అమ్మాయిలను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు.

క్వికర్‌.కాం వెబ్‌సైట్‌లో రిసెప్షనిస్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారి దరఖాస్తుల్లోని సెల్‌ నంబర్లకు ఫోన్‌ చేసి, తన పేరు ప్రదీప్‌ అని.. రాడిసన్‌ హోటల్‌లో ఉద్యోగుల ఎంపిక బాధ్యతలు చూస్తానని పరిచయం చేసుకునేవాడు. వారితో మాట కలపి వారి ఇంటర్వ్యూ చేస్తానని నమ్మబలికేవాడు.

వారు ఇతని మాటలు నమ్మాక, వారి మానసిక స్థితిపై ఓ అంచనాకు వచ్చేవాడు. తర్వాత మరో ఫోన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా మహిళ పేరుతో ఇంటర్వ్యూ అంటూ వారితో ఛాటింగ్‌ చేసేవాడు. ఫ్రంట్‌ ఆఫీస్‌ ఉద్యోగం కాబట్టి అందంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ముగ్గులోకి దింపేవాడు. తొలుత యువతుల సాధారణ చిత్రాల్ని సేకరించేవాడు. తర్వాత శరీరాకృతి చూడాల్సిన అవసరం ఉంటుందనేవాడు. ఎంపిక ప్రక్రియలో అదో భాగమని నమ్మించేవాడు. నేనూ మహిళనే కదా.. అంటూ ప్రలోభానికి గురి చేసి నగ్న చిత్రాలను సేకరించేవాడు. అమ్మాయిలు కూడా ఫోన్‌లో మాట్లాడింది మహిళే కదా అనే నమ్మకంతో తమ ఫోటోలు, వీడియోలు పంపేవారు. అలా పంపిన వారి చిత్రాలు, వీడియో దృశ్యాలను తన సెల్‌లో భద్రపరుచుకునేవాడు. ఇందుకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసి పాస్‌వర్డ్‌ను రక్షణగా పెట్టుకున్నాడు.

అలా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన సుమారు 2వేల మంది మహిళల నగ్నచిత్రాలను వాట్సాప్‌లో తెప్పించుకున్నాడు. అనంతరం ఇక రంగంలోకి దిగి వారిని బెదిరించేవాడు. తనతో వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేసేవాడు. ఆ రకంగా సుమారు 300 మంది మహిళలకు వీడియో కాల్‌ చేసి వారిని నగ్నంగా చూస్తూ లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఈక్రమంలో అతని ఉచ్చులో పడ్డ మియాపూర్‌కు చెందిప ఓ మహిళ ధైర్యం చేసింది. కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోన్‌ నంబర్ల ఆధారంగా నిందితుడిని గుర్తించి చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.

శుక్రవారం నగరానికి తీసుకువచ్చి కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లోని డేటా బయటకు లాగేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. నిందితుడిని ప్రాథమికంగా విచారించిన క్రమంలో మూసాపేట, జగద్గిరిగుట్ట, సిద్దిపేటకు చెందిన పలువురు మహిళలు అతడి బారిన పడినట్లు గుర్తించారు. సమగ్ర దర్యాప్తు నిమిత్తం నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాళ్లు ఎవరైనా ఉంటే మియాపూర్‌ ఠాణాలో సంప్రదించాలని లేదా 83329 81116 ఫోన్‌ నంబరుకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Updated : 24 Aug 2019 6:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top