గ్రేటర్‌లోని 500 పావురాలను అడవిలో వదిలిపెట్టిన బల్దియా - MicTv.in - Telugu News
mictv telugu

గ్రేటర్‌లోని 500 పావురాలను అడవిలో వదిలిపెట్టిన బల్దియా

October 25, 2019

పార్కులు, గుళ్లు, మసీదులు, చారిత్రాత్మక కట్టడాల వద్ద పావురాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటికి దాణా వేస్తే పుణ్యం వస్తుందని చాలామంది వాటికి దాణా వేస్తుంటారు. ఈ క్రమంలో పప్పులు, జొన్నలు వంటి ధాన్యాలు అమ్మే వ్యాపారులు పెరిగిపోయారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పావురాల సంఖ్య బాగా పెరుగిపోతోంది. దీంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అవి వేసే రెట్టలతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

వాటిమీద ప్రేమతో వాటికి మేత వేయొద్దని సూచిస్తున్నారు. మార్కెట్లు, దుకాణాలు ముఖ్యంగా ఆహార పదార్థాలు అమ్మేవారు వీటికి మేత వేయవద్దని చెబుతున్నారు. పలు బహుళ అంతస్తుల భవనాల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న హార్టీ కల్చర్ పార్కుల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్నిజీహెచ్ ఎంసీ ఇప్పటికే నిషేధించింది. పావురాల రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఫలితంగా మనుషుల అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. 

ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈరోజు  మీడియా ప్రకటన చేసింది.  మొజాంజాహి మార్కెట్లో పావురాలకు దాణాగా వేసే జొన్నలు, ఇతర  తృణ ధాన్యాలను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం  చేసుకున్నారు. పావురాల రెట్టలతో చారిత్రక కట్టడాలు పాడవుతున్నాయని అన్నారు.

మొజంజాహి మార్కెట్‌లో 500 పావురాల త‌ర‌లింపు

న‌గ‌రంలో హెరిటేజ్ క‌ట్ట‌డాల పున‌రుద్ద‌ర‌ణ‌లో భాగంగా మొజంజాహి మార్కెట్‌కు పూర్వ‌వైభ‌వం తేవ‌డానికి జీహెచ్ఎంసీ రూ.10 కోట్ల వ్య‌యంతో పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టింది. ఈ ప‌నుల్లో దాదాపు 70శాతానికి పైగా ప‌నులు పూర్తయ్యాయి. ముఖ్యంగా మార్కెట్ పై భాగంలోగ‌ల గుమ్మ‌టం, గ‌డియారం పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు పూర్త‌య్యాయి. అయితే పున‌రుద్ద‌ర‌ణ అయిన గుమ్మ‌టంపై మార్కెట్‌లో ఉన్న వేలాది పావురాలు రెట్ట‌లు వేయ‌డంతో అందవిహీనంగా మార‌డం.. తిరిగి వాటిని తొల‌గించ‌డం జీహెచ్ఎంసీ అధికారుల‌కు నిత్య‌కృత్యంగా మారింది. దీంతో పాటు మొజంజాహి మార్కెట్‌లో అత్య‌ధికంగా ఐస్‌క్రీమ్ షాపులు, మాంసం విక్ర‌య షాపులు, బేక‌రీలు ఉండ‌డంతో ఈ మార్కెట్‌లో వేలాదిగా ఉన్న పావురాల‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి.

దీంతో మొజంజాహి మార్కెట్ సుంద‌రీక‌ర‌ణ‌ను ప‌రిర‌క్షించ‌డం, పావురాల ద్వారా శ్వాస సంబంధిత వ్యాధుల నివార‌ణ‌కు ఈ పావురాల‌ను ప‌ట్టుకుని అట‌వీ ప్రాంతాల్లో వ‌దిలే కార్య‌క్ర‌మాన్ని జీహెచ్ఎంసీ నేడు చేప‌ట్టింది. దీనిలో భాగంగా మొజంజాహి మార్కెట్‌లో నేడు ఉద‌యం బ్లాక్‌రాక్ పిజియ‌న్‌లుగా వ్య‌వ‌హ‌రించే 500  పావురాల‌ను వ‌ల‌ల ద్వారా ప‌ట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ పావురాల‌ను అట‌వీశాఖ స‌ల‌హా మేర‌కు శ్రీశైలం అట‌వీ ప్రాంతంలో సుర‌క్షితంగా వ‌దిలేశామని జీహెచ్ఎంసీ వెట‌ర్న‌రీ విభాగం ఖైర‌తాబాద్ డిప్యూటి డైరెక్ట‌ర్ విల్స‌న్ తెలిపారు. 

మిగిలిన‌వాటిని కూడా అట‌వీ ప్రాంతంలో వ‌దిలేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని విల్స‌న్ తెలిపారు. ఈ పావురాల వ‌ల్ల శ్వాస‌కోశ సంబంధిత వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని, ముఖ్యంగా చిన్న‌పిల్ల‌లు, వృద్దుల‌కు వెంట‌నే సోకే ప్ర‌మాదం ఉంద‌ని వివ‌రించారు. ఈ పావురాల‌కు ఫీడింగ్ చేయ‌వ‌ద్ద‌ని, ముఖ్యంగా మార్కెట్లు, ఆహార ప‌దార్థాలు విక్ర‌యించే దుకాణాల వ‌ద్ద పావురాల‌ను ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని విల్స‌న్ కోరారు.