Hyderabad gold price silver price today bullion market
mictv telugu

బంగారం, వెండి భగ్గు.. ఏకంగా ఎంత పెరిగాయంటే..

November 5, 2022

బంగారం ధరలో భారీ ఒడిదొడుకులు నమోదవుతున్నాయి. తగ్గితే భారీగా తగ్గుతూ పెరిగితే అంతే భారీగా పెరుగుతూ కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. పెరిగినప్పుడు కొన్న జనం తగ్గుదల చూసి తొందరపడ్డామని బాధపడుతున్నారు. మొత్తానికి పెరిగినా తగ్గినా సగటున 50 వేల మార్కు దగ్గరే కదలాడుతుండడం ఒక్కటే ఊరట. ఈ ట్రెండుకు తగ్గట్టే తాజాగా పసిడి ధర భారీగానే పెరిగింది. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 46,100 నుంచి రూ. 900 పెరిగి రూ. 47,00 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,290 నుంచి రూ. 990 పెరిగి రూ. 51,280కి చేరుకుంది.

మరోపక్క వెండి ధర కూడా భగ్గుమంది. కేజీకి ఏకంగా రూ. 1900 పెరిగి రూ. 66,300కు చేరుకుంది. కొన్ని నెలల కిందట 60 వేల లోపే పలికిన రజతం కొన్ని రోజులుగ పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్తోంది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం ఎలాంటి పండగలు లేకపోయినా పెరుగుదల నమోదైంది. మార్కెట్ ఒడిదొడుకులు, దేశీయ డిమాండులో మార్పులు వల్ల పసిడి ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి.