హైదరాబాద్ కర్ణాటక పేరు మార్చేశారు.. ఇకపై..
ప్రాంతాలు సొంత అస్తిత్వాన్ని చాటుకుంటున్నాయి. చరిత్రలో ఎవరో పెట్టిన పేర్లు తమకొద్దంటున్నాయి. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరు మారిపోయింది. ఇకపై దీన్ని కల్యాణ కర్ణాటకగా వ్యవహించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. హైదరాబాద్ సంస్థానం విలీన రోజు సందర్భంగా పేరు మార్చారు. సీఎం కల్బుర్గిలో మాట్లాడుతూ..‘ఈ రోజు నుంచి హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం కల్యాణ-కర్ణాటకగా మారింది. ఇది కన్నడిగుల దశాబ్దాల డిమాండ్. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం.. ’ అని వెల్లడించారు.
హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం.. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేంది. విలీనం తర్వాత కూడా దీన్ని హైదరాబాద్ కర్ణాటక అని పిలిచారు. దీనిపై కన్నడిగులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కర్ణాటక ఉత్తర భాగంలో ఉన్న ఇందులో రాయచూర్, గుల్బర్గా, బీదర్, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలు ఉన్నాయి. 44,138 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో కోటీ 12 లక్షల జనాభా ఉంది.