నాలుగు పెళ్లిళ్లు.. ఆరుగురితో సహజీవనం - MicTv.in - Telugu News
mictv telugu

నాలుగు పెళ్లిళ్లు.. ఆరుగురితో సహజీవనం

December 3, 2020

peeli02

మన దేశ చట్టాల ప్రకారం ఒక మనిషి ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. రెండో పెళ్లి చేసుకోవాలంటే గట్టి కారణాలు ఉండాలి. గొడవలేమన్నా ఉంటే విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొందరు అవేం పట్టించుకోకుండా పెళ్లిపై పెళ్లి చేసుకోవడమే జీవిత పరమార్థంగా బతుకుతుంటారు. 

ఓ ప్రబుద్ధుడు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన వెంక‌ట‌బాల‌కృష్ణ ప‌వ‌న్‌కుమార్ బాగోతం ఇది. మాస్కులను మార్చినట్లు భార్యలను మారుస్తున్న ఇతగాడి పాపం ఎట్టకేలకు పండింది.  

అతడు 2018లో హిమబిందు అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కట్నం కింద‌ 40 లక్షలు వసూలు చేశాడు. భార్యతో దుబాయ్‌కి వెళ్లిన పవన్ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. భర్త ప్రవర్తనపై అనుమానంతో హిమబిందు కూపీ లాగింది. దీంతో అతని బండారం బయటపడింది. పవన్‌కు అప్పటికే మూడు పెళ్లిళ్లు అయినట్లు తెలిసింది. అంతేకాకుండా మరో ఆరుగురు మహిళలతో సన్నిహితంగా ఉంటున్నట్లు బయటపడింది. కానీ అతడేం భయపడలేదు. 

ఎలాగూ తెలిసిపోయింది కదా అని తన మూడో భార్యను తీసుకొచ్చి హిమబిందుకు పరిచయం చేశాడు. దీంతో సదరు నాలుగో భార్య కంగుతింది. తనకు న్యాయం చేయాని, పవన్ చేతిలో మరో అమ్మాయి మోసపోకుండా చూడాలని పోలీసులను కోరింది. పెళ్లి చాలా బాధ్యతతో కూడిన వ్యవహారం. అబ్బాయి, అమ్మాయి గురించి సరిగ్గా తెలుసుకోకుండా ముందడుగు వేస్తే తర్వాత చాలా సమస్యలు ఎదురవుతాయి. తస్మాత్ జాగ్రత్త!