అమెరికాలో హైదరాబాద్ యువకుడి దారుణ హత్య  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో హైదరాబాద్ యువకుడి దారుణ హత్య 

November 3, 2020

అమెరికాలో పేట్రేగుతున్న హింసా సంస్కృతికి హైదరాబాద్ యువకుడు బలయ్యాడు. జార్జియాలో కిరాణా దుకాణం నడుపుకుంటున్న మహ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్‌(37)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. ఆదివారం రాత్రి కిరాణా షాపు మూసేసి ఇంటికి తిరిగి వస్తున్న ఆరిఫ్‌పై నలుగురు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతణ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అక్కడే చనిపోయాడు.  పాతబస్తీ చంచల్ గూడకు చెందిన ఆరిఫ్‌ పదేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. 

అతడు ఓ స్పానిష్ వ్యక్తితో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో వివాదాలు ఉన్నాయని వాటి వల్లే హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరిఫ్ మృతివార్తతో హైదరాబాద్‌లోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. త్వరగా అమెరికా వెళ్లేందుకు ఎమర్జెన్సీ వీసా ఇవ్వాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలో తమకు బంధువులెవరూ లేరని, తన భర్త అంత్యక్రియలకు సాయం చేయాలని ఆరిఫ్ భార్య మెహనాజ్ ఫాతిమా కోరింది.