హైదరాబాదీ అతి తెలివి.. జొమాటోను అలా కూడా వాడేశాడు..
అర్ధరాత్రి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లడానికి ఎక్కువ ఖర్చవుతుందని భావించిన ఓ యువకుడు ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. షాపింగ్ మాల్ నుంచి ఎంతో దూరంలో ఉన్న ఇంటికి పైసా ఖర్చు లేకుండా వెళ్లాడు. దీనికి జొమాటోను సాయంగా వాడుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఒబేష్ కొమిరిశెట్టి అనే యువకుడు ఆగస్టు 7న ఇనార్బిట్ మాల్‌కు వెళ్లాడు. అప్పటికే సమయం రాత్రి 11.50 గంటలైంది. అతను అక్కడి నుంచి ఇంటికి వెళ్లడానికి ఆటోలు దొరకడంలేదు. దీంతో క్యాబ్ బుక్ చేద్దామనుకున్నాడు. అర్ధరాత్రి కావడం వల్ల క్యాబ్ రేటు రూ.300లకు పైగా చూపించింది. అదే సమయంలో అతడికి బాగా ఆకలి కూడా వేసింది. దానితో అతడికి వంచి ఉపాయం తట్టింది.
వెంటనే జొమాటో యాప్ ఒపెన్ చేసి తాను ఉన్న ఇనార్బిట్ మాల్ ప్రాంతానికి సమీపంలోని దోసె బండి హోటల్ నుంచి ఎగ్ దోసె ఆర్డర్ చేశాడు. ఒబేష్ ఆర్డర్ చేసిన దోసెను తీసుకోడానికి జొమాటో డెలివరీ బాయ్ దోసె బండి దగ్గరికి వచ్చాడు. దీంతో ఒబేష్ ఆ డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసి.. తాను కూడా దోసె బండి దగ్గరే ఉన్నానంటూ అతడిని కలిశాడు. ఆ తర్వాత జొమాటోలో తాను సూచించిన ఇంటి వద్ద తనను డ్రాప్ చేయాలని కోరాడు. దీంతో డెలవరీ బాయ్ ఒబేష్‌ను ఇంటికి చేర్చాడు. ఈ విషయాన్ని ఒబేష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. నన్ను ఇంటికి చేర్చిన డెలవరీ బాయ్..‘సర్, నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని మాత్రమే’ అడిగాడు. నన్ను ఉచితంగా ఇంటికి చేర్చిన జొమాటోకు ధన్యవాదాలు’’ అని ఒబేష్ ఈ పోస్టు చివర్లో పేర్కొన్నాడు. ఒబేష్ తెలివికి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.