ముస్లిం డెలివరీ బాయ్ వద్దంటూ.. ఫుడ్ క్యాన్సిల్ చేసిన హైదరాబాదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లిం డెలివరీ బాయ్ వద్దంటూ.. ఫుడ్ క్యాన్సిల్ చేసిన హైదరాబాదీ..

October 25, 2019

Hyderabad Man Refuses to Accept Food From Muslim Delivery Boy

కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ముస్లిం డెలివరీ బాయ్ వస్తున్నాడని తెలిసి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అప్పట్లో ఇది సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో కూడా జరిగింది. పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయగా ముస్లిం డెలివరీ బాయ్ వస్తున్నాడని తెలిసి తనకు హిందూ వ్యక్తే ఫుడ్ తీసుకురావాలంటూ వాదనకు దిగాడు. చివరికి అవకాశం లేక ఏకంగా తాను ఆర్డర్ చేసిన ఫుడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ ఘటనపై స్విగ్గీ కస్టమర్ ఎగ్జిక్యూటీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆలియాబాద్‌కు చెందిన అజయ్ కుమార్ బుధవారం రాత్రి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. కొద్దిసేపటికి అతనికి సులేమాన్ అనే డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకువస్తున్నట్టు తెలిసింది. అయితే ఆ వ్యక్తి ముస్లిం కావడంతో అతను దాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. తాను ముస్లిం వ్యక్తి తెచ్చిన ఫుడ్ తీసుకునేది లేదంటూ మరో డెలివరీ బాయ్‌ని పంపించాలని కస్టమర్ కేర్‌ను కోరాడు. అయితే అందుబాటులో వేరే వారు లేకపోవడంతో పాటు తమ కండీషన్స్ ప్రకారం ఎవరి యాప్‌కు కనెక్ట్ అయితే వారే తీసుకువస్తారంటూ కస్టమర్ ఎగ్జిక్యూటీవ్ సమాధానం ఇచ్చాడు. అయినా అజయ్ వినిపించుకోలేదు. 

అప్పటికే అజయ్ డబ్బులు కూడా చెల్లించడంతో చాలా సేపు ఫుడ్ తీసుకోవాలని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ విజయ్ కోరాడు. అప్పుడు అజయ్ మాట్లాడుతూ..‘ నా డబ్బులు తిరిగి రాకపోయినా పర్వాలేదు. నేను కావాలంటే బయటకు వెళ్లి ఫుడ్ తెచ్చుకుంటాను. కానీ ముస్లిం వ్యక్తి తెచ్చే ఆహారాన్ని మాత్రం తీసుకునేది లేదు. నేను ఇప్పుడు స్విగ్గీ యాప్ డిలీట్ చేస్తున్నా’ అంటూ ఫోన్ కట్ చేశాడు. చేసేది ఏమీలేక డెలివరీ బాయ్ ఫుడ్ వెనక్కి తీసుకెళ్లాడు. వెంటనే స్విగ్గీ ఎగ్జిక్యూటీవ్ శాలిబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కస్టమర్ వ్యవహరించిన తీరు సరిగాలేదని డెలివరీ బాయ్ సులేమాన్ తెలిపాడు. దీనిపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి చర్యలు ఏం తీసుకోవాలని పరిశీలిస్తున్నారు.