మూసీలో కొట్టుకుపోయిన వెంకటేశ్ ఆఖరి ఫోన్ కాల్  - MicTv.in - Telugu News
mictv telugu

మూసీలో కొట్టుకుపోయిన వెంకటేశ్ ఆఖరి ఫోన్ కాల్ 

October 16, 2020

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు మిగిల్చిన విషాధం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని రీతిలో వీధులు సెలయేళ్లను తలపించాయి. ఆ వరద ఉదృతిలో కొందరు కొట్టుకుపోయారు. పురాతన ఇళ్లు కుప్పకూలిపోయి కొందరు మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడుదామని ఒకరు వరదల్లో దిగి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. కార్లు తెప్పల్లా కొట్టుకుపోయిన దృశ్యాలు కోకొల్లలు. ఈ వరదల్లో వెంకటేశ్ గౌడ్ అనే వ్యక్తి కూడా కారుతో సహా వరదకు కొట్టుకుపోయి చివరికి శవమై తేలాడు. వెంకటేశ్ గౌడ్ తన మిత్రుడితో చివరిగా మాట్లాడిన కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందరినో కదిలిస్తోంది. 

తన కారు బలమైన నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిందని, సాయం చేసేందుకు ఎవరినైనా పంపించాలని వెంకటేశ్ గౌడ్ ఫోన్‌లో తన స్నేహితుడిని వేడుకున్నాడు. ప్రస్తుతం తన కారు ముందుకు కొట్టుకుపోకుండా ఓ చెట్టు ఆపిందని, టైర్లు పూర్తిగా మునిగిపోయాయని, కారులోకి కూడా నీరు వచ్చేస్తోందని చెప్పాడు. దీంతో అతని స్నేహితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దగ్గర్లో ఏమైనా గోడలు, చెట్లు ఉంటే ఎక్కాలని సూచించాడు. అయితే దగ్గర్లో ఓ గోడ కనిపిస్తోందని, కానీ తాను కారులోంచి బయటికి వస్తే వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడం ఖాయమని వాపోయాడు. కారు కొద్దికొద్దిగా వరదకు కదిలిపోతోందని భయంతో చెప్పాడు. అలాంటి భయాలేం పెట్టుకోకు.. నీకేం కాదని ఆ మిత్రుడు బాధితునికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆ కాల్ ముగిసింది. కాగా, దురదృష్టవశాత్తు వెంకటేశ్ గౌడ్ కారు వరద తీవ్రతకు కొట్టుకుపోవడంతో మృతిచెందాడు. దీంతో అతని కుటుంబంలో తీరని విషాధం అలుముకుంది.