అంబర్‌పేటలో ఓ చిన్నారిని కుక్కలు ఘోరంగా చంపిన ఉదంతంపై ఒక పక్క విమర్శలు వస్తుంటే సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం చాలా లైట్ తీసుకుంటోంది. మాంసానికి అలవాటు పడిన కుక్కలు ఆకలితో దాడి చేసి ఉంటాయని వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపిన హైదరాబాదర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై జనం తారస్థాయిలో మండిపడ్డారు. ఆర్జీవీ లాంటివాళ్లయితే, సిటీలోని కుక్కల్ని ఆమె ఇంట్లో వదిలిపెడితే సమస్య తీవ్రత అర్థమవుతుందని అన్నారు. అయినా మేయర్ పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఆ కుక్కలకు కరవమని నేను చెప్పానా? అంటూ ఆమె గుస్సా అయ్యారు.
మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘ఎవరినో కుక్కలు కరిస్తే, నేను కరమవని చెప్పినట్లు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ మేయర్‌గా పని చేయడం చాలా కష్టం. బాలుడి మృతి కేసేలో నన్ను ఎన్నో మాటలు అన్నారు..’’ అని చెప్పుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాల్సింది పోయి నోటికొచ్చినట్లు మాట్లాడ్డం సరికాదని, కుక్కల దాడిలో తమింటి పిల్లలు చనిపోతే ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నిస్తారు. కుక్కల నియంత్రణ కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని, దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.